తిరుప్పావై 5వ పాశురం | Thiruppavai pasuram 5 in telugu | dhanurmasam | Bhakthi Margam | భక్తి మార్గం
5. పాశురము :
త్తూయ పెరునీర్ యమునై తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణి విళక్కై
తాయై(క్) కుడల్ విళక్కం శెయ్ధ ధామోధరనై
తూయోమాయ్ వంధు నాం తూమలర్ తూవి(థ్) తొళుధు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క (ప్)
పోయ పిళైయుం ప్పుగుధరువా నిన్రనవుం
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెంబావాయ్
తాత్పర్యము:
మనమీ వ్రతము నాచరించి ఫలమందుటకు మన పాపములడ్డువచ్చునని భయపడవలదు. అందులకు కారణము మన వ్రతమునకు నాయకుడు శ్రీకృష్ణుడే. ఆతడు ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టలు కలవాడు. ఉత్తర మధురానగరికి నిర్వాహకుడుగ ఆవిర్భవించెను. నిర్మలమై గంభీరమైన జలముగల యమునానది యొక్క తీరవాసియై మనకై గొల్లకులమందవతరించి ఈ కులమును ప్రకాశింప జేసిన మంగళదీపము. మరియు తన పుట్టుకచే యశోదా గర్భమును కాంతివంతము జేసిన పరత్వము కలిగి కూడా ఆమెచే కట్టబడిన సులభుడు. కావున మనము సందేహములనే మలినములు లేక నిర్మలులమై, ఆతనిని చేరి చేతులారా నిర్మల హృదయపుష్పాన్ని సమర్పించాలి. నోఱార పాడాలి. మనసారా ధ్యానము చేయాలి. ఆ వెంటనే నిల్వయున్న పాపరాశి, రాబోవు పాపరాశి కూడ నిప్పునబడ్డ దూదిపింజవలె భస్మమై మన వ్రతమున కడ్డు తొలగును. కనుక రండి. భగవన్నామాన్ని చెప్పెదము.
అమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాశురాలలో ఐదవ పాశురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇందులో పరమాత్మను కీర్తించడం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని చెప్తున్నది. ఆ పరమాత్మయైన కృష్ణుడియొక్క వైభవాన్ని చిన్న చిన్న మాటలతో లోతైన భావాలతో అమ్మ అభివర్ణిస్తున్నది.
మాయనై - ఇక్కడ పరమాత్మని మాయావి అన్నారు. మాయ అన్నప్పుడు స్వామియొక్క విచిత్ర కార్యకరీ శక్తి. ఇక్కడ ఈమాత్రం అర్థం తెలుసుకుంటే చాలు. పరమేశ్వరుడు చేసేటటువంటి దివ్యములైన లీలలన్నీ తన మాయాశక్తితో చేస్తున్నాడు. "యోగమాయాముపాశ్రితః" అని భాగవతం చెప్తున్నది. యోగమాయా శక్తితో చేస్తున్నాడు. ఇక్కడ మాయ అన్నప్పుడు మన ఊహకి అంతుపట్టనిది ఏదో అది మాయ. అది ఈశ్వరునియొక్క కార్యము. "అఘటన ఘటనా పటీయసీ మాయా" అన్నారిక్కడ.
అనితరసాధ్యమైన ఈశ్వర శక్తి మాయ. అది విచిత్ర కార్యకరీశక్తి అని శాస్త్రం వర్ణిస్తున్నది. అటువంటి దివ్యమైనటువంటి మాయ కలవాడు.
మన్ను, వడమదురై మైన్దనై - నిత్యమూ భగవత్సంబంధం కలిగినటువంటి మధురకు నాయకుడు అన్నారు. ఈ మధురట ఎప్పుడూ భగవంతునితో సంబంధమున్నది.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా!
అంటాం. మధురా నగరం మోక్ష పట్టణాలలో ఒకటి. అయితే మనకు దక్షిణాపథంలో మధుర ఒకటి ఉన్నది.
మధురై అని అక్కడ మీనాక్షి దేవి ఉన్నది. పైగా ఈ తల్లి కూడా విల్లిపుత్తూర్ వాసి. దక్షిణాపథంలో తానుంది గనుక ఇక్కడ మధురను చెప్పినప్పుడు వడమదురై అన్నది. వడమదురై అంటే ఇక్కడ ఉత్తరాన ఉన్న మధుర అని. ఉత్తరాన ఉన్న మధురే కృష్ణుని యొక్క ఆవాసము. అక్కడే పుట్టాడు స్వామి. అది కృష్ణునితో నిత్యం సంబంధం కలిగినది. అంటే కృష్ణుడు పుట్టినప్పుడు మాత్రమే విష్ణుమయం కాలేదు అది. అది ఎప్పుడూ విష్ణుమయమే. కనుక కృష్ణుడు అక్కడ అవతరించాడు. తనయొక్క ధామమది. అందుకే ఆనాటి యుగాలలోనే అంబరీషుడు, ధృవుడు మొదలైన వారందరూ కూడా ఈ మధుర పరిసరాలలోనే సాధన చేసుకున్నారు. ఈ మధురానగరంలో పుట్టే తన బలాన్నంతటినీ ప్రకటించాడు. పుట్టినప్పుడే తన అనుగ్రహంతో వసుదేవుడియొక్క శృంఖలాలు ఛేదించిపోయేలా తనయొక్క అనుగ్రహబలాన్ని చూపించాడు.
అటుతర్వాత వ్రేపల్లెలో కూడా పూతన, తృణావర్తుడు, శకటాసురుడు, మొదలైన వారిని శైశవ దశలోనే సంహరించాడు. అటుతర్వాత మద్ది చెట్లను కూల్చివేశాడు. గోవర్ధన గిరిని ఎత్తాడు. ఇలా అనేకములైన లీలలను చూపించాడు గనుకనే స్వామియొక్క లీలలలో చూపించిన పరాక్రమాన్ని, ప్రతాపాన్నీ, మహిమనీ తలంచుకొని 'వడమదురై మైన్దనై' అని సంబోధించింది ఆ తల్లి. ఆవిధంగా ఉత్తర మధురకు నాయకుడై బలమైన వాడు. పైగా యమునాతీర విహారి.
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై - అంటే ఇక్కడ శుద్ధమైనటువంటి పెద్ద నీరైన యమునానదీ తీరములో ఉన్నవాడు. ఇక్కడ యమునకు రెండు విశేషణాలు ఉన్నాయి. త్తూయ పెరునీర్ - అంటే శుద్ధమైన పెద్ద నీరు - పెద్దనీరు అంటే లోతైన విశాలమైన నీరు - యమునా నదికి ఉన్న గొప్పతనం అది. ఆ యమునను తలంచుకుంటే చాలు, ధన్యులమౌతాం. అత్యంత పవిత్రమైన నది.
ఆయర్ కులత్తినిల్ - అంటే ఉత్తమమైన గోప వంశంలో ఉద్భవించినటువంటి
మణి విళక్కై - మంగళ దీపము అన్నారిక్కడ. ఉత్తమ వంశంలో పుట్టాడాయన. సాత్వత వంశం అది. ఆ దివ్యమైనటువంటి వసుదేవుని పరంగా చూసినా, ఇక్కడ నందుని పరంగా చూసినా ఉత్తమ వంశం. అలాంటి వంశంలో ఆయన ఉద్భవించాడు. పూర్వ కాలంలో మణిదీపాలు ఉండేవి. అవి ఎవరూ వెలిగించనక్కరలేదు. వాటంతట అవే ప్రకాశిస్తూ ఉంటాయి. అవి వెలగగానే మొత్తం చీకటి పోతుంది. ఇక్కడ స్వామిని మణిదీపం అని చెప్పడంలో విశేషం ఏమిటంటే ఆయన స్వయం ప్రకాశక స్వరూపుడు అనే భావం ఇందులో ఉంది.
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద - అంటే తల్లియైన యశోదాదేవి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేశాడు. అంటే యశోదాదేవి కొడుకుగా పుట్టి ఆమె కడుపును పండించాడు, వెలిగించాడు అని అంటే వైభవాన్ని తెచ్చాడు. అటువంటి
దామోదరనై - ఆ దామోదరుని మేము కీర్తిస్తున్నాము. యశోదకి, నందునికి ఘనకీర్తి కృష్ణుని వల్ల వచ్చింది. ఆయన అక్కడ ఉద్భవించడం చేతే ఆ కులము ఉత్తమ కులమైంది. ఆతల్లి గర్భము ప్రకాశమానమైనది. అలాంటి యశోదమ్మ చేత తాటిచే రోటికి కట్టబడ్డాడు స్వామివారు.
ఆ యశోదమ్మ భక్తికి ప్రతీక. ఆమె మాత్రమె కట్టగలిగింది. బ్రహ్మాది దేవతలు కూడా పట్టుకోలేని పరమాత్మని పట్టుకొని కట్టగలిగింది. ఆయనయొక్క భక్త సౌలభ్యమేదైతే ఉన్నదో దామోదర లీలలోనే కనపడుతుంది. అందుకే ఇక్కడ దామోదర అని చెప్పడంలో విశేషం అది. ఈవిధంగా త్రికరణములతో స్వామిని మేము ఆశ్రయించి ఆరాధిస్తున్నాం. ఇలా ఆశ్రయించడం వల్ల ఎం జరుగుతున్నది అంటే
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్ - స్వామిని చేతులారా సేవించడం వల్ల, నోరారా పాడడం వల్ల, మనసారా ధ్యానించడం వల్ల అంతవరకూ చేసిన సమస్త పాపములూ తరువాతి కాలంలో ఏం చేయబోతామో తెలియదు గానీ ఆ పాపములున్నూ ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఎలాగు అంటే
తీయినిల్ తూశాగుం - అంటే అగ్నిలో దూది వలె అన్నారు. అగ్నిలో వేసిన దూది ఎలా భస్మీపటలం అవుతుందో భగవంతుని సేవించిన వారి పాపరాశి అంతా దగ్ధమౌతుంది. సమస్త పాపములూ భస్మీపటలం అయిపోయాయి అంటే సరిపోతుంది.
కానీ ఇదివరకు చేసిన పాపములూ, ఇకపై రాబోయే పాపములు చెప్పడం
లో ఉద్దేశం ఏమిటి? ఇది మనం ఆలోచిస్తే భగవత్ చింతన చేసేవాళ్ళు మళ్ళీ పాపాలు చేస్తారా? ఇవాళ భగవత్ చింతన చేశాం కనుక రేపు పాపాలు చేసినా ఫరవాలేదు ఎలాగో పోతాయి అని భావం ఇందులో లేదు. ఇందులో ఉన్న ఆంతర్యాన్ని పరిశీలించాలి. రాబోయే పాపములు అంటే మనం గత జన్మలలో ఎన్నెన్ని కర్మలు చేసి ఉన్నామో మనకు తెలియదు. మనకు కనపడుతున్నది ఈ జన్మ మాత్రమే. ఈ జన్మలోనే మనం కర్మక్షయం చేసుకోవాలి. కర్మక్షయం చేసుకోవాలి అంటే ఈ కర్మ శరీరాన్ని మనం పవిత్రం చేసుకోవాలి.
ఈ కర్మ శరీరంలో మూడు కరణములున్నాయి. అది శరీరము, మాట, మనస్సు. ఈ మూడు కరణములూ కృష్ణమయం చేసుకొని కృష్ణార్పణం చేసుకోగలిగితే మన శరీరంలో ఉన్న సమస్త కర్మలూ దగ్ధమౌతాయి. ఈ కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నవి కొన్ని ఉన్నాయి. ఇక తర్వాత జన్మలలో అనుభవించబోయే పాప ఫలములు కూడా దాగి ఉన్నాయి మనదగ్గర. సంచితములుగా ఎన్నో కర్మలు దాగి వున్నాయి. ప్రారబ్ధ కర్మలు ఈ శరీరంతో తెచ్చుకున్నాం.
ఇప్పుడు ఆగామి కర్మలు ప్రోగు చేసుకుంటున్నాం. కానీ ఆ సంచిత కర్మలు కూడా దహనమైతే తర్వాత జన్మలు లేకుండా ఉంటుంది. ఆ సంచితములు ఏవి ఉన్నాయో మనకు తెలియదు. అవే తరువాత రాబోయే జన్మలకి మూలములైన కర్మలు. అందుకు రాబోయే పాపములు అంటే తర్వాతి జన్మలలో అనుభవించ బోయే కర్మ ఫలములేవైతే ఉన్నాయో అవి కూడా దగ్ధమైపోతాయిట భగవత్ సంకీర్తన వల్ల. అందువల్ల ఈ సంచితమూ, ఆగామి కూడా నశించి పోతాయి.
ఆ కారణం చేత నువ్వు శుద్ధుడవ వుతావు అని చెప్తున్నారు. సర్వ పాప నాశకమైనటు వంటి ఆ పరమాత్మను
శెప్పు - అంటే కీర్తించు అని చెప్తున్నారు. ఇలా కీర్తిస్తూ త్రికరణములతో ఆశ్రయించడమనే కృష్ణ భక్తి వైభవాన్ని ఈ పాశురంలో వర్ణించింది తల్లి.
Comments
Post a Comment