శ్రీ కాళ హస్తీశ్వర శతకం | sri kalahastiswara satakam in telugu | bhakthi margam | భక్తి మార్గం

 
శ్రీ కాళ హస్తీశ్వర శతకం

శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. 

ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు. ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.

శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా
సేవన్‌ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!     1

సంపదలు అనే మెరుపు తీగలతో కూడిన, సంసారమనే మేఘముల నుండి కురిసిన, పాపములనే నీటిధారల చేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ అను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు కలవాడనై, నీ చిన్మూర్తిని ధ్యానించుచూ బ్రతుకుతాను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతమగును).

వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!         2

ఈశ్వరా! బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని, నీ ఇంటి సింహద్వారదేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టాలను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమోకానీ, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించునట్లు చేసినావు కదా!

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్‌ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!     3

ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.

నీ నా సందొడఁబాటుమాట వినుమా! నీ చేత జీతంబు నే
గానిం బట్టక సతతంబు మది వేడ్కంగొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీ నొల్లన్‌ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!         4

ఈశ్వరా! నీకూ నాకూ అంగీకారమైన మాట ఒకటి చెప్తాను వినుము. నీ నుండి ఏ కాణీ కూడా జీతము ఆశింపక, నిత్యము నిన్ను సేవిస్తాను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు అప్పగింపక రక్షించు. ఆ అనుగ్రహము చాలు. ఇంక నాకు గుర్రాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యములు వద్దు. అటువంటివేమీ కోరను.

భవకేళీ మదిరా మదంబున మహా పాపాత్ముడై వీడు న
న్ను వివేకింప డటంచు నన్ను నరకార్ణోరాశి పాలైనఁ బ
ట్టవు, బాలుండొక చోట నాటతమితోడన్‌ నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!     5

జనన మరణ రూపమైన సంసారమనే ఆటలోపడి, కల్లు తాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని యీ నరుడు మహాపాపియై నన్ను (భగవంతుని) తెలుసుకొనలేకున్నాడని, నరక సముద్రములో మునిగిపోతుండగా చూస్తూ ఊరుకుంటావా? ఆటలధోరణిలో బాలుడు బావిలో పడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండా ఊరుకుంటాడా? నీవు నన్ను రక్షింపకుండుట న్యాయము కాదని భావము.

స్వామిద్రోహము చేసి వేరొకనిఁ కొల్వన్‌ బోతినో? కాక నే
నీ మాట ల్విననొల్ల కుండితినో? నిన్నే దిక్కుగాఁ జూడనో?
యేమీ, యిట్టి వృధాపరాధి నగు న న్నీ దు:ఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీ కాళహస్తీశ్వరా!     6

ఈశ్వరా! నిన్ను కాదని స్వామి ద్రోహము చేసి, మరొక దేవుని సేవించానా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకము లేక నిరాదరణ చేసి, నాస్తికుడనైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను, ఈ సంసార దు:ఖసముద్రంలో ముంచి, చూసి వినోదించటం నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించటం నీ కర్తవ్యం కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వారిని నమ్మినవారిని నాస్తికులంటారు.)

దివిజక్ష్మారుహ ధేను రత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
నువు నీ విల్లు; నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశి కన్యా విభుం
డు విశేషార్చకుఁ డింక నీ కెన ఘనుండున్ గల్గునే? నీవు చూ
చి విచారింపవు; లేమినెవ్వఁడుడుపున్? శ్రీ కాళహస్తీశ్వరా!     7

కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతము నీకు విల్లు. నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు. లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ పరమ భక్తుడు. ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెవ్వడు? వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి దరిద్రమును పోగొట్టగల సామర్ధ్యము నీకున్నది. అయినా ఆ పని చేయవు. నిన్ను మరిచిపోతానని భయమా? నా మీద నీ అనుగ్రహ దారిద్రమును పోగొట్టేవాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు?

నీతో యుద్ధము చేయనోపఁ; గవితానిర్మాణశక్తి నిన్నున్
బ్రీతుం చేయగలేను; నీ కొరకుఁ తండ్రిన్ చంపగాఁజాల; నా
చేతన్ రోకట నిన్ను మొత్తవెరతున్‌; చీకాకు నా భక్తి, యే
రీతిన్నాకిక నిన్నుఁ చూడగలుగున్? శ్రీ కాళహస్తీశ్వరా!     8

అర్జునునిలాగా నీతో యుద్ధము చేయలేను. కవిత్వము చెప్పి నిన్ను సంతోషపరచలేను. శివభక్తుని వలే తండ్రిని చంపలేను. శివభక్తురాలి వలే నిన్ను రోకలితో మొత్తలేను. నా భక్తి, నాకు అడ్డమై నీ దయను పొందనీయకుండా చేస్తుంది. నిన్ను చూసే అవకాశం ఇంక నాకెలా కలుగుతుంది?

ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నా మెడ గట్టినాడ విక నిన్నేవేళఁ జింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి, యీ
శీలామాలపుఁ జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!         9

ఈశ్వరా! భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనములు అనే పాశములను నా మెడకు చుట్టావు. ఈ వ్యామోహంలో పడి నిన్ను నేనెట్లా స్మరించగలను? ఈ భరింపరాని దుఃఖము ఎలా పోగొడతావో శంకరా! నీ దయ.

నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామము న్మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుం దారును ముక్తులౌదురనిశాస్త్రంబుల్‌ మహాపండితుల్
చెప్పంగాఁ దమకింక శంకలుండవలెనా? శ్రీ కాళహస్తీశ్వరా!     10

శ్రీకాళహస్తీశ్వరా! నీ పేరు స్మరిస్తేనే కొండల వంటి పాపాలు పోతాయని, యముని వల్ల కలుగు నరకబాధలు తప్పుతాయని వేదశాస్త్రాలు, పండితులు చెప్తుంటే, ఈ మానవులకు ఇంకా అనుమానాలెందుకు? నీ పేరును స్మరించుటకు సిద్ధపడరెందుకు?

వీడెం బబ్బినయప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో
గూ డున్నప్పుడు, శ్రీవిలాసములు పై కొన్నప్పుడుం గాయకుల్
పాడంగా వినునప్పుడుం చెలగుదంభప్రాయ విశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!         11

ఈశ్వరా! నిన్ను, నీ ధ్యానమును మరచి, తమకు తాంబూలము దొరికినప్పుడు, అనగా భోగములు కలిగినప్పుడు, తమను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్యవైభవములు బాగా ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు తమ గొప్పతనమును చూపుటకై ఆడంబరముగా దానధర్మములు చేస్తూ విర్రవీగు వారిని ఏమనాలో తెలియదు.

నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు  పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!     12

ఈశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహాచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహములు గానే కనిపిస్తాయి.

ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు; నీ పాదసం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!         13

ప్రాణికోటికి మోక్షము కలుగుటకు నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణం గానీ, చదువులెన్ని చదివినా జ్ఞానమును, మోక్షమును కలిగించునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికీ జ్ఞానము కలిగిందా? మోక్షము కలిగిందా? నీ దయతో మోక్షము పొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకొంది? ఎరుకలవాడు ఏ మంత్రజపము చేశాడు. వీరందరూ ముక్తి పొందటానికి చదువులే కారణమైనవా?

కాయల్గాచె వధూ నఖాగ్రములచేఁ గాయంబు, వక్షోజముల్
రాయన్రాపడె ఱొమ్ము, మన్మధ విహరక్లేశ విభ్రాంతిచే,
ప్రాయంబాయెను, బట్టగట్టెఁ దల, చెప్పన్ రోత సంసారమేఁ
జేయంజాల విరక్తుఁ చేయఁ గదవే శ్రీకాళహస్తీశ్వరా!         14

ఈశ్వరా! స్త్రీల గోళ్ళగాట్లతో నా శరీరము కాయలు కాచింది. వారి స్తనముల రాపిడితో నా రొమ్ము రాయిలాగా గట్టిపడిపోయింది. మన్మధక్రీడల మీద వ్యామోహంలో పడి వయసు గడిచిపోయింది. తల బట్టతలై వెంట్రుకలు రాలిపోయినవి. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంసారం అంటే అసహ్యం కలుగుతుంది. ఇక నాకు పరిపూర్ణ వైరాగ్యము కలిగించి భవబంధ విముక్తున్ని చేయి.

నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో? స్త్రీ
చన్నో? కుంచమొ? మేక పెంటికయొ? యీ సందేహముల్మాన్పి, నా
కన్ను లన్ఖవదీయమూర్తి సగుణాకారంబుగాఁ జూపవే
చిన్నీ రేజ విహారమత్త మధుపా! శ్రీకాళహస్తీశ్వరా!         15

ఈశ్వరా! మోకాలో, స్త్రీ స్తన్యమో, కుంచమో, మేకపెంటియో నీ రూపము ఏదని నమ్మి భావించి సేవింతును? నా యీ అనుమానాలన్నీ పోగొట్టి నీ సుగుణమూర్తిని నాకు చూపించి ధన్యున్ని చేయుము.

నిను నా వాకిలిఁ గావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతిఁ గుం
టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చితిను, తింటేగాని కాదంటినో?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ చే
సిన నా విన్నపమేల చే కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా!     16

ఈశ్వరా! బాణాసురునిలాగా నిన్ను నా గుమ్మము వద్ద కాపలా కాయమన్నానా? దేవతా స్త్రీలపై మోహపడి, వారివద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా? తిన్నడు లాగా ఎంగిలి మాసం పెట్టి, తింటే గానీ వీల్లేదన్నానా? ఏ తప్పు చేశాను. సజ్జనులను రక్షించమన్నాను. అంతేకదా! నా ప్రార్ధన వినిపించుకోవేమి?

ఱాలన్ రువ్వఁగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచునే
చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేఁ గాను,నా
శీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో
శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!         17

అజ్ఞానియైన ఒక కిరాతకుడు పూలులేవని రాళ్ళతో పూజించినట్లు నేను చేయలేను. సిరియాళునిలాగా కుమారుని పిలిచి చంపి వంటచేసి జంగమదేవులకు పెట్టలేను. తిన్నడు లాగా కన్నులు పీకి నీకు సమర్పించలేను. ఇంక నా భక్తి గాఢమైనదని ఎలా చెప్పగలను? ఈ మాత్రము భక్తికి నీవు హృదయములో సంతోషపడినచో అదే నాకు మహాభాగ్యము.

రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు సం
భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యధా
బీజంబుల్, తదపేక్ష చాలుఁ, పరితృప్తింబొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము, దయతో శ్రీకాళహస్తీశ్వరా!     18

ఈశ్వరా! రాజులు ఐశ్వర్యముతో మదించినవారు. వారి సేవ నరకము వంటిది. వారు దయతో ఇచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు మొదలగునవి సంసార బంధములు పెంచి దుఃఖమును కలిగిస్తాయి. వీటన్నింటినీ అనుభవించి సంతృప్తి పడ్డాను. ఇంక వాటిపై వ్యామోహము చాలు. జ్ఞాన సంపదను, దానివల్ల కలిగే మోక్షమును నాకు ప్రసాదించుము.

నీ రూపంబు దలంపగాఁ తుదమొదల్నేగాన, నీవై నచో
రా రా రమ్మని యంచుఁ చెప్పవు, వృధారంభంబులింకేటికిన్
నీరన్ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడం జుమీ
శ్రీ రామార్చిత పాదపద్మయుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!     19

ఈశ్వరా! నీ రూపము ఊహించాలంటే, దాని మొదలు - చివర నాకు తెలియవు. పోనీ, నీవైనా నన్ను రమ్మని పిలుస్తావా? పిలవవు. ఇంక దయకై ఎన్ని పాట్లు పడిన ఏమి ప్రయోజనం? నన్ను నీట ముంచినా, పాల ముంచినా నీదే భారము. నిన్నే నమ్ముకొన్నాను.

నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!     20

ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక కలిగినచో, నీ చేతిలో లేడి ఉంది. గండ్రగొడ్డలి ఉన్నది. నీ మూడవకంటిలో నిప్పున్నది. తలమీద నీరున్నది. కొంచెము శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా? ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా? నీవంటి వాడు ఇట్లు చేయవచ్చునా?

రాజైదుష్కృతిఁ చెందెఁ చందురుడు, రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁ గాంచె దు:ఖము; కురుక్ష్మాపాలుఁ డామాటనే
యాజిం గూలె సమస్త బంధువులతో; నా రాజ శబ్దంబు ఛీ!
ఛీ! జన్మాంతరమందు నొల్లనుజుమీ! శ్రీ కాళహస్తీశ్వరా!     21

చంద్రుడు తాను రాజై గురుపత్నిని అపహరించి పాపమును మూటగట్టుకొనెను. కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖము పొందెను. దుర్యోధనుడు కూడా పాండవులను సమూలముగా నాశనము చేసి రారాజు కావలెనన్న ఆశతో యుద్ధమునకు దిగి సమస్త బంధుమిత్రులతో నాశనమయ్యెను. ఈ రాజశబ్దములో ఇంత దోషమున్నది. కాబట్టి మరొక జన్మలో కూడా రాజు కావలెను అని కోరను. నీ దయారస వీక్షణమున్నచో చాలు.

రాజర్ధాతురుడైనచో నెచట ధర్మంబుండు? నేరీతి నా
నా జాతి క్రియ లేర్పడున్? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు? రూ
పాజీవాళికి నేది దిక్కు? ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ
రేజంబుల్ భజియింతురే తెరగునన్? శ్రీకాళహస్తీశ్వరా!     22

పరిపాలకుడైన రాజు ధనమునందు ఆశ కలిగి పరిపాలన సరిగా చేయకపోతే రాజ్యములో ధర్మము ఎక్కడ ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మములు ఎలా సక్రమంగా నడుస్తాయి? మంచివారికి సుఖం ఎలా కలుగుతుంది? వేశ్యలు మొదలైన వివిధ వృత్తులవారికి జీవనం ఎలా గడుస్తుంది? నీ భక్తులు స్వేచ్ఛగా నిన్నెలా సేవింపగలుగుతారు?

తరగల్, పిప్పల పత్రముల్ మెఱగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత కీటప్రభల్
సురవీధీ లిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపయ: పిండముల్
సిరులందేల మదాంధు లౌదురో జనుల్ శ్రీ కళహస్తీశ్వరా!     23

శంకరా! సంపదలు, నీటికెరటాలలాగా, రావిఆకులలాగా, మెరుపుటద్దాలలాగా, గాలిలోని దీపాలలాగా, ఏనుగు చెవులులాగా, ఎండమావులలాగా, మిణుగురుపురుగులులాగా, ఆకాశంలోని అక్షరాలలాగా, జీవులలోని ప్రాణాలలాగా, వెన్నెల ముద్దలలాగా చాలా చంచలములు, అశాశ్వతములు కదా! మనుషులు అటువంటి సంపదలతో గర్వించి తిరుగుతారేమి?

నిన్ను నమ్మినరీతి నమ్మనొరులన్, నీకన్న నా కెన్న లే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే! శ్రీ కాళహస్తీశ్వరా!     24

ఈశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు ఇతరులను ఎవరినీ నమ్మను. నాకు నీ కంటే అన్నలుగానీ, తమ్ములుగానీ, తల్లిదండ్రులుగానీ, గురువులుగానీ, కష్టాలలో ఆదుకొను ఆప్తులుగానీ ఇంకెవ్వరూ లేరు. నన్ను ఈ సంసార విషసముద్రమును దాటించి చిదానంద స్వరూపమైన సౌఖ్యసముద్రంలో ఎప్పుడు తేలియాడిస్తావో కదా! అంతా నీ దయ.

నీ పంచం బడియుండగాఁ గలిగిననన్భిక్షాన్నమే చాలు ని,
క్షేపం బబ్బిన రాజకీటకముల నే సేవింపగా నోప, నా
శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై, బంటుగాఁ
చేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!         25

ఈశ్వరా! నీ చూరుకింద నిలబడగలిగినచో, నాకు ఆ అదృష్టమే చాలు; భిక్షాన్నమైనా తిని బ్రతుకుతాను. పురుగులవంటి అధములైన ఈ రాజులను సేవింపలేను. నీవు నీ సేవకునిగా అంగీకరించునంత దయ కలిగితే, నన్ను ఇంక ఆశాపాశములతో బంధించి ఈ సంసార తాపత్రయంలో పడేయక విముక్తున్ని చేయి.

నీ పేరున్, భవదంఘ్రి తీర్ధము, భవ న్నిష్ఠ్యూత తాంబూలమున్
నీ పళ్ళెంబు ప్రసాదమున్ గొనికదా నే బిడ్డనైనాడ! న
న్నీ పాటిం కరుణింపు మోపనిక నే నెవ్వారికిం బిడ్డగాన్
చేపట్టందగుఁ పట్టి మానఁదగదో శ్రీ కాళహస్తీశ్వరా!         26

ఈశ్వరా! నీ నామస్మరణం, నీ పాద తీర్ధం, నీవు నమిలి విడిచిన తాంబూలం, నీకు నివేదన చేసిన ప్రసాదం వీనిని స్వీకరించి కదా నీ పుత్రుడనైనాను! నీకిలా కొడుకు అయిన తర్వాత మరెవ్వరికీ కొడుకుగా పుట్టలేదు. నన్ను నీ దగ్గరికి చేర్చుకో. చేరుకున్న తరువాత మరలా విడిచి పెట్టకూడదు సుమా! (అనగా 'నీ సేవ చేయు నాకు పునర్జన్మ లేని మోక్షమును ప్రసాదింపుము' అని భావం.)

అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నే నన్నన్శివా! నిన్ను నే
సుమీ! నీమదిఁ తల్లిదండ్రుల నటంచుంజూడగాఁబోకు, నా
కిమ్మైఁ తల్లియుఁతండ్రియున్ గురుఁడు నీవే కాన సంసారపుం
జిమ్మం జీకటి గప్పకుండఁ గనుమా! శ్రీ కాళహస్తీశ్వరా!     27

ఈశ్వరా! అమ్మా అని, నాన్నా అని నేను ఎవ్వరినీ, ఏ జన్మలో పిలిచినా, ఆ పిలుపులన్నీ నిన్నే అని గ్రహించు. ఆ జన్మలనిచ్చిన తల్లితండ్రులను కాదని గ్రహించు. ఇప్పుడు నే నీ జన్మ ఎత్తాను. నాకిప్పుడు కూడా నీవే తల్లి, తండ్రి, గురువు. కావునా నన్ను ఈ జననమరణరూప సంసారం అనే చీకటిలో పడకుండా కాపాడు. (కొడుకు చీకటిలో దారి తెలియక తల్లడిల్లుతుంటే, తల్లిదండ్రులు చూసి ఊరుకుంటారా? వానిని వెలుగులోకి తీసుకురారా? అలాగే నన్ను జ్ఞానప్రకాశంలోకి తెచ్చి రక్షించు.)

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై!
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!     28

ఈశ్వరా! లోకంలోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవచక్రవర్తి దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన శుకమహర్షికి ఏ దుర్గతులు కలిగెను. ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసుకొని పోవునా? వట్టిది. "జ్ఞానేనహి నృణాం మోక్షః"

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగా నోపునే?
దహనుం గప్పగఁ జాలునే శలభసంతానంబు? నీ సేవఁ చే
సి హతక్లేశులుగారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!     29

ఈశ్వరా! విషమస్థానంలో నుండి గ్రహములు కలిగించు బాధలుగానీ, అపశకునములుగానీ, రోజూ నీ నామస్మరణం చేయు పుణ్యప్రురుషులను కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానంలో పడి నిన్ను సేవించక దుఃఖములను అనుభవిస్తున్నారుగానీ, మిడుతలదండు అగ్నిని ఆవరింపలేదని గ్రహింపలేకున్నారేమి? ఇదెంత చిత్రమైన విషయము?

అడుగం బో నిక నన్యమార్గరతులం ప్రాణావనోత్సాహినై,
యడుగంబోయినఁ బోదుఁ నీదు పద పద్మారాధక శ్రేణీయు
న్నెడకున్, నిన్ను భజింపగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి? భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!     30

ఈశ్వరా! నా జీవనయాత్ర సాగుటకై శైవులుకాక యితర మార్గానుసారులను యాచించను. ఒకవేళ యాచించినా, నీ చరణదాసులైన భక్తులనే యాచిస్తాను. అయినా, నిన్ను సేవించు పద్దతులు తెలుసుకొన్న నాకు ఇతరులను యాచించు అవసరమేమి ఉన్నది? నీ అనుగ్రహము కలిగిచో ఈ అల్పములైన ప్రాపంచిక సుఖములు ఎందుకు కోరతాను? అసలు కోరుటకు వీనిలో సారం ఏమున్నది?

మదమాతంగము లందలంబులు హరుల్మాణిక్య ముప్పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలముల్పరిమళంబుల్మోక్ష మీజాలు! నే
మదిలో వీని నపేక్ష చేసి నృపధామద్వారదేశంబుగా
చి దనంబుల్ వృథపుత్తు రజ్ఞులకటా! శ్రీ కాళహస్తీశ్వరా!     31

ఏనుగులు, గుర్రాలు, మేనాలు, పల్లకులు, రత్నములు, పట్టుబట్టలు, సుగంధద్రవ్యాలు ఇవన్నీ మనకు మోక్షం ఇస్తాయా? అజ్ఞానులైన మనుష్యులు ఈ పైవానన్నింటినీ కోరుకొంటూ రాజద్వారముల వద్ద పడిగాపులు పడి రోజులు వ్యర్ధముగా గడుపుచున్నారు. నీ ఆరాధన చేసి శాశ్వత మోక్షానందమును పొందవచ్చునని గ్రహింపలేకున్నారు.

రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్,
పాసీ పాయదు పుత్రమిత్రజన సంపద్ర్బాంతి, వాంఛాలతల్
కొసీ కోయదు నామనం బకట! నీకున్ ప్రీతిగా సత్ర్కియల్
చేసీ చేయదు, దీని త్రు ళ్ళణచవే శ్రీకాళహస్తీశ్వరా!         32

ఈశ్వరా! నా మనసు చంచలము. ఇది స్త్రీ సౌఖ్యములను పూర్తిగా విడనాడదు. పుత్రులు, మిత్రులు, సంపదలు వీని మీది భ్రమను పూర్తిగా విడువదు. కోరికలను పూర్తిగా చంపుకోదు. నీకు ఇష్టంగా సేవ చేయటానికి కూడా సహకరించదు. అలాని పూర్తిగా నిన్ను మరచి ఆ విషయములందే కూరుకుపోదు. ఈ చంచలమైన మనసుకు స్థిరత్వమును ప్రసాదించు.

ఎన్నేళ్ళుండుదు? నేమి గందు? నిఁక నే నెవ్వారి రక్షించెదన్?
నిన్నే నిష్టభజించెద న్నిరుప మోన్నిద్రా ప్రమోదంబు నా
కెన్నం డబ్బెడు? నెంతకాల మిఁక నేనిట్లున్న నేమయ్యెడిన్‌?
జిన్నం బుచ్చక నన్ను నేలుకొనవే! శ్రీ కాళహస్తీశ్వరా!     33

ఈశ్వరా! ఎన్నాళ్లు బ్రతుకుతాను? చూడవలసినవన్నీ చూశాను. ఇంకేం చూడాలి? ఇంతకాలం, భార్యాపుత్రులను పోషించాను. ఇంకెంతకాలం పోషించగలను. నిన్నే నమ్మి సేవించే నాకు తురీయావస్థలోని (జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవునికి మూడు అవస్థలుంటాయి. ఆ మూడింటినీ మించి నాలుగవ అవస్థ కూడా ఉంటుంది. దానిని తురీయమందురు. ఆ తురీయావస్థకు (అనగా ధ్యానసమాధికి) చేరుకొన్న యోగసిద్ధులు ఆత్మసాక్షాత్కారం పొంది ఆనందిస్తారు.) ఆ ఆనందము నాకెప్పుడు కలుగును. ఎంతకాలం ఈ నిరీక్షణలో గడిపినా ప్రయోజనం ఏం ఉన్నది? నన్ను నిరాశపరచక దయచూపి రక్షించు.

చావం గాలము చేరువౌ టెరిఁగియుం చాలింపఁ గాలేక, త
న్నే వైద్యుండు చికిత్సఁ బ్రోవగల డో? ఏ మందు రక్షించునో?
ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు, నిన్నింతైనఁ చింతింపఁడా
జీవశ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!     34

తన శ్రాద్ధం తాను చేసుకున్న సన్యాసికూడా, తనకు రోజులు దగ్గర పడుతున్నాయని, మరణం తప్పదని తెలిసికూడా బ్రతుకుమీద ఆశను చంపుకోలేక, వచ్చిన రోగంను ఏ వైద్యుడు తగ్గిస్తాడూ, ఏ మందు పనిచేస్తుందో, ఏ దేవతలు రక్షిస్తారో ఆలోచిస్తూ, ఉన్న కొద్ది సమయంను వ్యర్ధం చేస్తాడు కానీ, నిన్ను ఒక్క క్షణమైనా ధ్యానించడు
.
దినముం చిత్తములో సువర్ణముఖరీ తీరప్రదే శామ్రకా
నన, మధ్యోపరివేది కాగ్రమున, నానందంబునం పంకజా
సననిష్ట నిన్ను జూడగన్న నదివోసౌఖ్యంబు లక్ష్మీ విలా
సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీ కాళహస్తీశ్వరా!     35

శంకరా! సువర్ణముఖీ నదీతీరం దగ్గరి మామిడితోటలోని రాతిఅరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న నిన్ను, ప్రతిరోజూ మనసులో చూడగలిగితే, అదే ఆనందం, అదే సౌఖ్యంగానీ చంచలస్వభావం గల లక్ష్మీదేవి చూపు నటనలు (ఒకసారి అనుగ్రహించుట, ఒకసారి తిరస్కరించుట అను భిన్న భావములు) సౌఖ్యం కలిగించునా?

ఆలంబు న్మెడఁగట్టి, దానికి నపత్యశ్రేణిఁ కల్పించి, త
ద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి, యా
మాలార్కంబున బాంధవంబనెడి ప్రేమంగొందరం ద్రిప్పగా,
సీలన్సీలనమర్చినట్లొసంగితో శ్రీ కాళహస్తీశ్వరా!         36

ఒక స్త్రీని భార్య అని మెడకు తగిలించి, తనతో సంతానం కలిగించి, ఆ తర్వాత వారికి పెళ్ళిపేరంటాలు అంటూ, ఇచ్చిపుచ్చుకొను బాంధవ్యములు సమకూర్చి, మాలలో కొలికిపూస చుట్టూ మిగిలిన పూసలు తిరుగేటట్లు, యంత్రంలో సీలతో సీలను కలిపి తిప్పినట్టు ఈ సంసారంను ఏర్పరిచావు కదా!

తనువే నిత్యముగా నొనర్పు; మదిలేదా! చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు, మా గతులు రెంట న్నేర్పులేకున్న లే
దని నాకిప్పుడెచెప్పు చేయగల కార్యంబున్న సంసేవఁ జే
సి నినుంగాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!     37

ఈశ్వరా! ఈ శరీరము శాశ్వతంగా ఉండేట్లు చేయి. లేదా చచ్చిన తరువాత మరలా జన్మించే ఏర్పాటు చేయి. ఈ రెండు పనులూ నీకు చేతకాకపోతే, నాకు ఆ సంగతి చెప్పు. బ్రతికి ఉన్నప్పుడే సకాలంలో నేను చేయవలసిన పనులన్నింటినీ చక్కబెట్టుకుని, మరణానంతరం నిన్ను చూడటానికి వస్తాను.

పదునా ల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు, చెల్లించెన
య్యుదయాస్తాచలనసంధి నాజ్ఞ నొకడాయుష్మంతుడై వీరి య
భ్యుదయంబెవ్వరు చెప్పగా వినరొ! అల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మంచు నక్కట కటా శ్రీ కాళహస్తీశ్వరా!     38

శంకరా! ఒక రాజు పద్నాలుగు మహాయుగములు పాలించెను. (మహాయుగమనగా కృత త్రేత ద్వాపర కలియుగములు నాలుగూ కలిసినది.) మరొక రాజు ఉదయగిరి నుండి అస్తగిరి వరకు ఉన్న భూమిని నిరాఘాటంగా పాలించాడు. ఇటువంటి మహారాజుల చరిత్రలను ఈ అల్పులైన రాజులు వినలేదా? తాము కూడా రాజులమే అని ఎలా గర్వపడుతున్నారో!

రాజన్నంతనె బోవునా? కృపయు, ధర్మం, బాభిజాత్యంబు, వి
ద్యాజాతక్షమ, సత్యభాషణము, విద్యన్మిత్రసంరక్షయున్
సౌజన్యంబు, కృతంబెరుంగుటయు, విశ్వాసంబుగాకున్న దు
ర్బీజ శ్రేష్ఠలుగా గతంబుకలదే శ్రీ కాళహస్తీశ్వరా!         39

ఈశ్వరా! రాజు అవగానే దయాధర్మములు, అభిమానం, విద్యావివేకములు, దానివల్ల కలిగే ఓర్పు, సత్యవాక్పరిపాలనం, పండితులను, స్నేహితులను పోషించే మంచితనం, కృతజ్ఞత, విశ్వాసం అన్నీ నశించిపోతాయా? ఏమో! లేకపోతే రాజులు ఇలా పరమనీచులుగా ఉండటానికి కారణమేమి?

మునునీచే నవవర్గ రాజపదవీ మూర్ధాభిషేకంబుఁ గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో! చింతించి చూడంగ, నె
ట్లనినం కీట, ఫణీంద్ర, పోత, మదవేదండో గ్రహింసావిచా
రిణిఁ గాగాఁనినుఁ గానఁగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!     40

ఈశ్వరా! పూర్వం నీవల్ల మోక్షం పొందిన పుణ్యాత్ములూ, నేనూ సమానులమే. ఎలా అంటావా? సేవ విషయంలో సాలెపురుగు, పాము, ఏనుగు, కిరాతకుడైన తిన్నడు, నేను సమానులమే కదా! వారు నిన్ను ఆత్మలో దర్శించినవారు. నేను దర్శించలేదు. అంతే, చిన్న బేధము కదా! వారికి ఇచ్చినట్లు నాకు కూడా మోక్షం ఇవ్వరాదా?

రాజైదుష్కృతిఁ చెందెఁ చందురుడు, రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దు:ఖము; కురుక్ష్మాపాలుఁ డామాటనే యాజిం గూలె సమస్త బంధువులతో; నా రాజ శబ్దంబు ఛీ!

పవమానాశన భూషణప్రకరము, ల్భద్రేభ చర్మంబు, నా
టవికత్వంమ్ముఁ బ్రియంబులై భుజగ శుండా లాటవీ చారులన్
భవదు:ఖంబులఁ బాపు, టొప్పుఁ జెలఁదిం బాటించి కైవల్య మి
చ్చి వినోదించుట కేమి కారణమయా? శ్రీ కాళహస్తీశ్వరా!     41

శంకరా! నీకు పాముల నగలన్నా, ఏనుగు తోలన్నా, కిరాత వేషమన్నా చాలా అభిమానం. అందుకే పాముకు, ఏనుగుకు, కిరాతునకు మోక్షమిచ్చావని తెలుసుకున్నాను. కానీ పనికిమాలిన సాలెపురుగుకు కూడా పెద్దపీటవేసి మోక్షమెందుకిచ్చావో తెలియదు.

అమరస్త్రీల రమించినన్ జెడదు మోహంబింతయున్‌ బ్రహ్మ ప
ట్టము సిద్ధించిన నాస దీరదు, నిరూఢ క్రోధమున్ సర్వలో
కముల న్మ్రింగిన మాన, దిందుఁగల సౌఖ్యంబొల్ల, నీ సేవ చే
సి మహాపాతక వారిరాశిఁ గడతున్ శ్రీకాళహస్తీశ్వరా!         42

శంకరా! నా మోహము, దేవతాస్త్రీలను అనుభవించినా చాలదు. నా ఆశ, బ్రహ్మపదవి వచ్చినా తీరదు. నా జీవలక్షణమైన కోపము, సర్వలోకాలనూ మ్రింగినా తగ్గదు. ఇంక ఈ లోకములోని సౌఖ్యములను నేను ఆశించను. నీ సేవ చేసి పాపసాగరములను దాటి నీ దగ్గరకు వస్తాను.

చనువారిం గని యేడ్చువారు జముఁడా! సత్యంబుగా వత్తు మే
మనుమానం బిఁకలేదు నమ్ముమని తా రావేళ నా రేవునన్
మునుగం బోవుచు బాసచేయుట సుమీ ముమ్మాటికింజూడగాఁ
చెనటు ల్గానరు దీని భావ మిదివో శ్రీకాళహస్తీశ్వరా!         43

శంకరా! చనిపోయిన వారిని గురించి పదవరోజు, రేవులో మునుగుతూ బంధువులు ఏడుస్తారు, 'యముడా! మేము మాత్రం శాశ్వతంగా ఉంటామా? ఏదో ఒకరోజు నిజంగా వస్తామని ప్రమాణాలు చేయటానికే. ఈ భావం ఆ ఏడుపులోనే ఇమిడి ఉన్నది. వివేకహీనులు మాత్రం ఈ భావమ

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , lord shiva mantras , most powerful lord shiva slokas in telugu , lord shiva lingastakam in telugu , lord shiva panchakshari mantram , lord shiva puranam in telugu , jyotirlingas , jyothirlinga stotras in telugu , pancharama kshetralu , shivananda lahari , soundarya lahari , shivastakam , chandrasekharastakam , kashi vishwanadastakam ,kalabhairavastam,dhakshina murthy stotram , bhilvastakam , dwadasa jyotirlinga stotram in telugu, bhakthimargam, bhaktimargam, bhakti margam, bhakthimargam.in bhakthi margam telugu , sri kala hasthishwara shatakam in telugu, sri kalahastiswara satakam telugu pdf, sri kalahastiswara satakam padyalu with bhavam in telugu, dhurjati sri kalahastiswara satakam, srikalahasti temple history in telugu, srikalahasti temple timings, online booking,srikalahasti temple timings, online booking, srikalahasti temple rahu ketu pooja tickets online booking 

Comments