సుబ్రహ్మణ్యస్వామి జీవిత చరిత్ర | స్కందోత్పత్తి | subramanya shanmukothpathi in telugu | Bhakthi Margam | భక్తి మార్గం
శివపార్వతుల కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలాకళోత్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆదిదంపతుల ఆనందనిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది. సమస్త దేవతా గణములు,సాధు పుంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు.
తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరమేమనగా… పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని. శివుడు అంటే కామాన్ని గెలిచిన వాడు, ఆయన ఎప్పుడు తనలోతానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధపెడుతున్నాడు.
శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భావిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి, అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మ గారిని దర్శించి, అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు. అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు…”బ్రహ్మాదిదేవతలారా! మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి..” అని ఓదార్చారు.
దేవతలంతా… “పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా?” అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి “దేవాదిదేవా! ప్రభూ మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధలనుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని, అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్ధిస్తారు. భక్తవ శంకరుడు అయిన పరమశివుడు, పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు, దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు.
దేవతల ప్రార్ధన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండీ విడివడింది కాబట్టి, నాతేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది, తను మాత్రుమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గానూ, అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై, “నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక, ఇకమీదట దేవతలెవరికీ సంతానము కలుగదు అని దేవతలందరినీ శపిస్తుంది“. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం ముఫ్ఫైమూడుకోట్ల మంది అంతే.
అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశ పెడతాడు.
అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి, ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుక్లషష్ఠినాడు, ఒక బాలుడు ఉద్భవించాడు.
ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుభిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు.
శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది.
అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించుటం కోసం శివుని నుండి, స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచపర్వతాన్ని భేదించడం వలన, క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామి వారిని మురుగన్, కందా, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు
సరే ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు… అని అడిగితే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్య ఖండంలో, బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు.
నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు. ఇవ్వడానికి నువ్వొకడివి, నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది. ఉన్నది అంతా ఒకటే కాబట్టి, నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు, వరమూ, శాపమూ అని మళ్ళీ రెండు ఉన్నాయా, వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు, నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి? ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడౌతాడు.
అప్పుడు ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే, ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో “నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను…” అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ”ఇదేమిటి!! శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటూన్నావు అని అడిగితే..” అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు..”శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ, కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి, యోనిసంభవుడిగా రానమ్మా…. నన్ను క్షమించు” అని చెప్తాడు.
నీ కోరిక నెరవేరడానికి, ఒకనాడు నీవు మోహినీ అవతారములో ఉన్నప్పుడు, కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండీ నేను ఉద్భవిస్తాను. కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు.
సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చిందీ అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధం బోధించినవాడు కాబట్టి స్వామి సు-బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిఛ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా, శంకరుడు, కుమారుని నుండీ ప్రణవార్ధం విన్నాడు కాబట్టి, శివగురు లేదా స్వామినాథ అనే నామంకూడా వుంది.
సుబ్రహ్మణ్యస్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడూ, మన్మథుని వలె అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ, అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి. అలాగే స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామం కూడా వుంది. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము.
స్కందోత్పత్తి
తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా!
సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! || 01 ||
తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్!
ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! || 02 ||
యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా!
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! || 03 ||
యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా!
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమాగతిః!! || 04 ||
దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః!
స్వా౦తయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! || 05 ||
శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు!
తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! || 06 ||
ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః!
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!! || 07 ||
జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్!
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!! || 08 ||
తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన!
ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!! || 09 ||
తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్!
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!! || 10 ||
దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన!
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!! || 11 ||
దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః!
గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!! || 12 ||
తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్!
దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!! || 13 ||
సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః!
సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!! || 14 ||
తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం!
అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం!
దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!! || 15 ||
అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః!
ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!! || 16 ||
శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం!
ఉత్ససర్జ మహాతేజః శ్రోతోభ్యో హాయ్ తదానఘ!! || 17 ||
యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!! || 18 ||
కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం!
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!! || 19 ||
మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ!
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!! || 20 ||
నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం!
సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!! || 21 ||
జాత రూపమితి ఖ్యాతం తదాప్రభృతి రాఘవ!
సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం!
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!! || 22 ||
త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః!
క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!! || 23 ||
తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం!
దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!! || 24 ||
తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్!
పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!! || 25 ||
తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే!
స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!! || 26 ||
స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్!
కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!! || 27 ||
షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!! || 28 ||
అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!! || 29 ||
సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం!
అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!! || 30 ||
ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా!
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!! || 31 ||
భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః!
ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!!
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!! || 32 ||
సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదలు నుంచి రక్షింపబడతారు
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
Comments
Post a Comment