History of Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple | Vemulawada Temple History In Telugu

వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రంలోని ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకున్నది.
కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం.

స్థల విశిష్టత
ఈ దేవాలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.
చరిత్ర
ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది.

1830లో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో ప్రస్తావించారు. తన యాత్రామార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి (డిచ్‌పల్లి సమీపంలోని గ్రామం) గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, భీమేశ్వర రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం
శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.

రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడితుంది దేవస్థానం.

కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.
ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.

భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు
ప్రత్యేకపూజలు
* ఉదయం 4 నుంచి 4.10 వరకు మంగళ వాయిద్యాలు
* ఉదయం 4.10 నుంచి 4.30 వరకు సుప్రభాత సేవ, ప్రదాత హారతి
* ఉదయం 4.30 నుంచి 4.45 వరకు సర్వదర్శనం
* ఉదయం 4.45 నుంచి 5 వరకు ఆలయ శుద్ధి
* ఉదయం 5 నుంచి 5.15 వరకు గోపూజ
* ఉదయం 5.15 నుంచి 6.15 వరకు ప్రాతఃకాల పూజ
* ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు దర్శనాలు
* సాయంత్రం 6 నుంచి 7 వరకు ప్రదోశకాల పూజ
* రాత్రి 9 నుంచి 10 వరకు నిశిపూజ
* రాత్రి 10 నుంచి 10.20 వరకు పవళింపు సేవ, అనంతరం దేవస్థానం మూసివేత
దర్శనవేళలు
* ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి రాత్రి 10.20 గంటలకు పవళింపుసేవ అనంతరం మూసివేస్తారు.
* ధర్మదర్శనం ఉచితం, ప్రత్యేక దర్శనం రూ. 20, ప్రత్యేక ప్రవేశదర్శనం రూ. 100
* సాధారణ దర్శనం: ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రాత్రి 7.30 నుంచి 8.30 వరకు
* ప్రత్యేక దర్శనం: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7.30 వరకు. ఒక టికెట్‌పై నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.
* ప్రత్యేక దర్శనం టికెట్లకు పరిమితి లేదు.
* దర్శన సమయాల్లో ఎలాంటి విరామం లేదు.
* ప్రత్యేక దర్శనం టికెట్ల వివరాలు: ప్రత్యేక దర్శనం రూ. 20, త్వరిత దర్శనం రూ. 100
ఆలయప్రాంగణంలోని ఉప ఆలయాలు
రామాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, బాలా త్రిపురసుందరీదేవి ఆలయం, మహిషాసురమర్ధిని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం.

* ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు లేవు. అన్ని చోట్లా ఉచిత దర్శనమే.
ఆర్జిత సేవలు.. ప్రధానపూజలు
ఆలయంలో.. తెల్లవారుజామున 4.35 గంటల నుంచి 5 గంటల వరకూ ఉచిత సర్వదర్శనం.
* ధర్మదర్శనం, అభిషేకం ఉదయం 6.15 నుంచి 11.30 వరకు ఉచితంగా ఉంటుంది.
* అన్నపూజ మధ్యాహ్నం 12.15 నుంచి 2 గంటల వరకు.. టికెట్‌ ధర రూ. 200, రూ. 600.
* బిల్వార్చన, శివార్చన మధ్యాహ్నం 2.30 నుంచి 6 వరకు, టికెట్‌ ధర రూ.600.
* ఆకుపూజ రూ. 150, మహాపూజ రూ. 100, పల్లకిసేవ రూ. 200, పెద్దసేవలు రూ. 350.
* నిత్యకల్యాణం ఉదయం 10.30 నుంచి 12.30 వరకు.. టికెట్‌ ధర రూ. 1000.
* అన్నపూజల నివేదన: ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు.. టికెట్‌ ధర రూ. 200
* శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు, టికెట్‌ ధర రూ. 350
* కుంకుమపూజ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు, టికెట్‌ ధర రూ. 150
* మహాలింగార్చన సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 వరకు... టికెట్‌ ధర రూ. 1000
* గండదీపార్చన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు.. టికెట్‌ ధర రూ. 5
* కోడెమొక్కులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు.. టికెట్‌ ధర సాధారణం రూ. 100, ప్రత్యేకం రూ. 200
* ఆలయంలో పూజలకు ఆన్‌లైన్‌ సౌకర్యం లేదు.
* ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాలైన రామాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, బాలత్రిపురసుందరీదేవి ఆలయం, మహిషాసురమర్ధిని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేకపూజలు లేవు.
* దేవతామూర్తుల పూజలు, టికెట్లు, పల్లకిసేవలు, పెద్దసేవలు, కల్యాణాలు

ఆలయంలో నిర్వహించే పూజలు నిర్వహించే సమయాలు
1. ప్రాతఃకాల పూజ,   2. మధ్యాహ్న పూజ,  3. ప్రదోషకాల పూజ,    4. నిశికాల పూజ
ఆలయంలో ఇతర పూజలు
1. మాస శివరాత్రికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన
2. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రదోశపూజ
3. పునర్వసు నక్షత్రం రోజున మహాన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకం, ఉప ఆలయాల్లో సదస్యం
4. రేవతి నక్షత్రం సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉపాలయంలో సదస్యం
ప్రత్యేక రోజులు.. విశిష్ట పూజలు
* ఉగాది సందర్భంగా నవరాత్రులు,  * శ్రీరామనవమికి కల్యాణోత్సవం, * ఆషాఢమాసంలో తొలి ఏకాదశి పూజలు, * శ్రావణమాసంలో గోకులాష్టమి ఉత్సవాలు, * వినాయకచవితికి నవరాత్రి ఉత్సవాలు, * దసరాకు దేవీనవరాత్రి ఉత్సవాలు, * దీపావళికి లక్ష్మీపూజ, * కార్తీక పౌర్ణమికి ద్వాదశి తులసీ కల్యాణం, * వైకుంఠ చతుర్దశికి మహాపూజ, పొన్నసేవ, * మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన, * ఫాల్గుణ మాసంలో రాజరాజేశ్వరస్వామివారికి శివకల్యాణం, ఐదురోజులపాటు ప్రత్యేక పూజలు * ఆర్జితసేవల టికెట్లకు ఆన్‌లైన్‌ సౌకర్యం లేదు.
ఆలయంలో వసతి సౌకర్యాలు
* రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 489 వసతిగదులున్నాయి. ఫోన్‌నంబర్‌: 08723-236018, * రాజేశ్వరపురం ఏసీ 4 గదులు.. అద్దె రూ. 350,  * పార్వతిపురం 88 గదులు, అద్దె రూ. 200, * నందీశ్వరపురం ఏసీ సూట్స్‌ 8, అద్దె రూ. 2,000, ఏసీ గదులు 56, అద్దె రూ. 1000, నాన్‌ ఏసీ గదులు 122, అద్దె రూ. 350, * లక్ష్మీగణపతిపురంలో 88 గదులు అందుబాటులో ఉండగా.. అద్దె రూ. 250,  * శివపురంలో 46 గదులు అద్దె రూ. 150,  * శంకరపురంలో 58 గదులు అద్దె రూ. 50, * భీమేశ్వర వసతి సముదాయంలో రెండు గదులు.. అద్దె రూ. 2,000, * అమ్మవారి కాంప్లెక్స్‌ 8 గదులు.. అద్దె రూ. 1,000
హోటళ్లు
* హరిత హోటల్‌ 8 గదులు. అద్దె నాన్‌ ఏసీ రూ. 550, ఏసీ రూ. 1000
ఎలా వెళ్లొచ్చంటే: 
హైదరాబాద్‌ నుంచి సుమారు 150 కి.మీ.ల దూరంలో ఉన్న వేములవాడ వెళ్లేందుకు ఎంజీబీఎస్‌.. జేబీఎస్‌ నుంచి సిద్దిపేట.. సిరిసిల్ల మీదుగా టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులున్నాయి. సుమారు ప్రతి 30 నిమిషాలకొకటి చొప్పున బస్సు సర్వీసులున్నాయి. అలాగే శంషాబాద్‌ విమానాశ్రయం ద్వారా కూడా హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి వేములవాడకు చేరుకోవచ్చు. ప్రైవేటు క్యాబ్‌లు.. బస్సులు విస్తృతంగా ఉన్నాయి.

Comments