తమిళనాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం పళని | tamil nadu sri subrahmanyam swamy palani temple history in telugu | bhakthi margam | భక్తి మార్గం
తమిళనాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం పళని
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండుక్కల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.
ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.
ఆలయ చరిత్ర
భారతదేశంలో హిందూ పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రంలో పర్వత ప్రాంతాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు మనకు కనిపిస్తాయి.
ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కొలిచే దేవుళ్లలో పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడైన కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) ఒకరు. తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నాయి.
పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని, పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే, అప్పుడు పెద్దవాడు, వినాయకుడు యుక్తితో ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తారు.
మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని, వినాయకుడు “తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే.
కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్న వాడు కదండీ, దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండీ, అందులోనూ చిన్న వాడు, శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత, గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా, శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.
ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని, “ నువ్వే సకల జ్ఞాన ఫలానివి రా నాన్నా” అని ఊరడిస్తారు. సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు.
ఆలయ సమయం
ఆలయం ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు తెరిచి ఉంటుంది. పండుగ రోజుల్లో ఆలయాన్ని తెల్లవారుజామున 4.30 గంటలకు తెరుస్తారు.
Comments
Post a Comment