Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా 2025 ప్రారంభ తేదీ, పవిత్ర ముఖ్యమైన స్నాన దినాలు

హిందూమతంలో అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైన సమావేశాలలో ఒకటి, దీనిని మహా కుంభమేళా అని పిలుస్తారు , ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2025లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని భావిస్తున్నారు.

దేశం నలుమూలల నుండి యాత్రికులు గంగా, యమునా మరియు పౌరాణిక సరస్వతి నది సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానాలు చేస్తారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ మహా కుంభమేళా ముగియనుండగా.. మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. అయితే ఇప్పుడు జరగనున్న కుంభమేళా మహా కుంభమేళా అని.. ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెబుతున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను.. 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే.. ఈ మహా కుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ.. మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు.. మహా కుంభమేళ ప్రారంభం అవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం.. భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒకరోజుతో సమానం. దీని ప్రకారం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే.. భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహా కుంభమేళానే. ఇక ఈ మహా కుంభమేళాను కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహా కుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు.

ప్రయాగ్‌రాజ్ కాకుండా హరిద్వార్‌లోని గంగానది, నాసిక్‌లోని గోదావరి నది, ఉజ్జయినీలోని శిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తుంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే.. మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం.. దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో.. బయటికి వచ్చిన అమృతం కోసం.. దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతాలో ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి.. ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు.

మహా కుంభమేళా 2025 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

మహా కుంభమేళా 2025 జనవరి 13, 2025న పౌష్ పూర్ణిమ స్నానంతో ప్రారంభమవుతుంది మరియు ఇది ఫిబ్రవరి 26, 2025న ముగుస్తుంది.

మహా కుంభమేళా 2025: ముఖ్యమైన స్నాన తేదీలు

* మొదటి రోజు స్నానం 13 జనవరి 2025న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు.

* రెండో రోజు స్నానం మకర సంక్రాంతి 14 జనవరి 2025న చేస్తారు.

* మూడో రోజు స్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేయాలి.

* నాల్గవ రోజు స్నానం బసంత్ పంచమి, 3 ఫిబ్రవరి 2025న చేస్తారు.

* ఐదవ రోజు స్నానం మాఘ పూర్ణిమ, 12 ఫిబ్రవరి 2025 రోజున చేయాలి.

* ఇక, 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాటి చివరి రోజు స్నానం చేస్తారు.

దిగువ షెడ్యూల్ ప్రకారం మహా కుంభ్ 2025 మేళా నాలుగు వేర్వేరు ప్రదేశాలలో నిర్వహించబడుతుంది.

హరిద్వార్ - సూర్యుడు మేషరాశిలో మరియు బృహస్పతి కుంభరాశిలో ఉన్న సందర్భంగా హరిద్వార్‌లో మేళా జరుగుతుంది.

ప్రయాగ్రాజ్ - సూర్యుడు మకరరాశిలో ఉన్న సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో మేళా నిర్వహిస్తారు.

నాసిక్ - సూర్యుడు మరియు బృహస్పతి కొన్ని స్థానాల్లో ఉన్న సందర్భంగా నాసిక్‌లో మహా కుంభమేళా నిర్వహిస్తారు.

ఉజ్జయిని - సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి సింహరాశిలో ఉన్న సందర్భంగా ఉజ్జయినిలో మహా కుంభమేళా నిర్వహిస్తారు.

కుంభమేళా రకాలు

కుంభమేళాలు మొత్తం 3 రకాలు ఉంటాయి. అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహా కుంభమేళా. ప్రతీ 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా. చివరిసారిగా అర్ధ కుంభమేళాను 2019లో నిర్వహించారు. ఇక ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళాను 2013లో ఏర్పాటు చేశారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహా కుంభమేళా. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరిగేది ఈ 144 ఏళ్లకరు ఒకసారి వచ్చే మహా కుంభమేళా కావడం గమనార్హం. మహా కుంభమేళా చూసే అదృష్టం.. ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుందని చెబుతారు.

మహా కుంభమేళాలో ఇంకేం ఉంటాయి?

మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలే కాకుండా.. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు జరుపుకుంటారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి ఇస్తారు. భక్తి గీతాలను ఆలపిస్తారు. అంతేకాకుండా.. మతపరమైన ఆచారాలతో పాటు, సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామాగ్రిని విక్రయించే స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. భక్తి గీతాలు, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో కుంభమేళా జరిగే ప్రాంతం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది.

Tags: Maha Kumbh Mela 2025 Snan Date, Kumbh Mela 2025 date and place, Kumbh Mela 2025 Package, Where is the next Maha Kumbh Mela 2025, Kumbh Mela 2025, Special train for kumbh mela 2025, Maha Kumbh Mela 2025 dates, Kumbh Mela 2025 official website

Comments