అరుణాచలం 2025 పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు | Arunachalam Giripradakshina Dates 2025 | Bhakthi margam
అరుణాచలం 2025 పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు | Arunachalam Giripradakshina Dates 2025
శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే.. అరుణాచలం. అందుకే.. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మరి.. ఏ రోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుందో తెలుసుకుందాం.
దక్షిణ భారతంలోని తమిళనాడులో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది అరుణాచలం. దీన్ని తమిళులు.. తిరువణ్ణామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంతకీ.. 'గిరి ప్రదక్షిణ' ఏ రోజుల్లో చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఏడాది అనుకూలమైన రోజులేవి? ఎలా చేరుకోవాలి? అనే వివరాలు తెలుసుకుందాం.
తలచినంత మాత్రముననే సకల పాపాలను పోగొట్టే మహా పుణ్యక్షేత్రం అరుణాచలం. "అరుణాచలం" అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ. అంటే ఎర్రని కొండ అని అర్థం. ఇది చాలా గొప్ప పుణ్య క్షేత్రము.
అరుణాచలంలో శివ దర్శనం కన్నా గిరి ప్రదక్షిణకే ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే అరుణ గిరియే సాక్షాత్తూ పరమశివుడనే భావం ఉండడం చేత భక్తులు పాదచారులై గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ విధంగా శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడ లక్షలాదిమంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక శ్రావణ పౌర్ణమి, కార్తిక పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాలలో ఇక్కడ దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.
గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి.
పౌర్ణమి రోజుల్లో అరుణాచ గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని, కోరిక కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. చంద్రుడు ఆ రోజు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట. కాబట్టి, ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే.. మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. పగటిపూట సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక ఎక్కువ మంది రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. లేదా మధ్యాహ్నం మూడు గంటలకు మొదలు పెడితే రాత్రి 8 గంటల లోపు గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది.
రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. సాధారణంగా గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచే మొదలు పెట్టి అరుణాచలేశ్వరుని ఆలయం వద్దకు చేరుకున్నాక ముగిస్తారు.
గిరి ప్రదక్షిణ లో తప్పకుండా చూడవలసిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ స్వామి కొండ చుట్టూ అష్ట దిక్పాలకులు ఉంటారని ప్రతీతి. అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ వలయంలో ముందుగా ఇంద్ర లింగం దర్శించాలి. తర్వాత వలయంలో క్రమంగా అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం ఇలా అన్నింటిని దర్శించుకుంటే గిరి ప్రదక్షిణ చేస్తేనే ప్రదక్షిణ ఫలం దక్కుతుందని విశ్వాసం. ముఖ్యంగా ప్రదక్షిణ వలయంలో వచ్చే ఆది అన్నామలై ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాలి.
గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు:
గిరి ప్రదక్షిణం చేసే వారు పాదరక్షలు లేకుండా వెళ్లడం మంచిది.
చెప్పులు లేకుండా గిరి వాలం చుట్టి వస్తే పుణ్యప్రధమని భక్తులు విశ్వసిస్తారు.
బరువు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకపోవడం మంచిది.
గిరి ప్రదక్షిణ చేయాలంటే దాదాపు 14 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది.
వీలైతే ఉదయం 10 గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించుకుంటే మంచిది.
భక్తులు తమ వెంట పండ్లు, నిమ్మకాయలను తీసుకెళ్లడం ఉత్తమం.
ఈ ఏడాది అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదిలు ఇవే :
ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ ప్రతినెలా పౌర్ణమి రోజుల్లో చేస్తుంటారు. ఇక ఈ ఏడాది(2025) ఏ నెలలో ఎప్పుడప్పుడు పౌర్ణమి తిథి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
జనవరి నెలలో పౌర్ణమి తిథి 13వ తేదీ సోమవారం ఉదయం 5:03 నుంచి 14వ తేదీ మంగళవారం ఉదయం 3: 56 నిమిషాల వరకు.
ఫిబ్రవరి నెల లో పౌర్ణమి తిథి 11వ తేదీ మంగళవారం సాయంత్రం 6:55 నిమిషాల నుంచి 12వ తేదీ బుధవారం సాయంత్రం 7: 23 నిమిషాల వరకు.
మార్చి నెల లో పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీ గురువారం ఉదయం 10:30 నుంచి 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు
ఏప్రిల్లో పౌర్ణమి తిథి.. 12వ తేది శనివారం ఉదయం 3.21 నిమిషాల నుంచి మరుసటి రోజు 13 వ తేది ఆదివారం ఉదయం 5.51 నిమిషాల వరకు ఉంది.
మేలో పౌర్ణమి 11వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల 1 నిమిషాల నుంచి 12 వ తేది సోమవారం రాత్రి 10 గంటల 25 నిమిషాల వరకు ఉంది.
జూన్లో పున్నమి 10వ తేదీ మంగళవారం ఉదయం 11.35 నిమిషాల నుంచి 11 వ తేది బుధవారం మధ్యాహ్నం 1.13 నిమిషాల వరకు ఉంది.
జూలైలో పౌర్ణమి తిథి 10వ తేది గురువారం ఉదయం 11 గంటల 35 నిమిషాల నుంచి 11వ తేది శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల 13 నిమిషాల వరకు ఉంది.
ఆగష్టులో 08వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల నుంచి తేది శనివారం 9వ తేదీ మధ్యాహ్నం 1 గంటల 24 నిమిషాల వరకు పౌర్ణమి ఉంది.
సెప్టెంబర్లో పౌర్ణమి 7వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 1 గంటల 41 నిమిషాల నుంచి అదే రోజు ఆదివారం రాత్రి 11 గంటల 38 నిమిషాల వరకు ఉంది.
అక్టోబర్లో 6వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల నుంచి తర్వాతి రోజు 7వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల 16 నిమిషాల వరకు పౌర్ణమి తిథి ఉంది.
నవంబర్లో పౌర్ణమి 4వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల 48 నిమిషాల వరకు ఉంది.
డిసెంబర్లో పౌర్ణమి 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల 37 నిమిషాలకు మొదలై 5వ తేదీ సాయంత్రం 4 గంటల 43 నిమిషాల వరకు ఉంది.
ఎలా చేరుకోవాలంటే : తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలో అరుణాచలం ఉంది. బెంగళూరు నుంచి 202 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
Comments
Post a Comment