శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితాలు - 2024 - 2025 | 2024 Rashi Phalalu| Bhakthi Margam


శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితాలు - 2024 - 2025

మేష రాశి : 

అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 

ఆదాయం 8, వ్యయం : 14, రాజపూజ్యం : 4, అవమానం: 3

ఈ రాశివారి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది. శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనం అమర్చుకుంటారు. గృహంలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. చిత్తశుద్ధితో శ్రమించిన గాని ఆశించిన ఫలితాలు పొందలేరు. దంపతుల మధ్య సఖ్యత లోపం, అకారణ కలహాలు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. తరుచు విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. 

ఉద్యోగస్తులు పనియందు ధ్యాస వహించాలి. ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురికావద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటె రబీ ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ సందర్శనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. ఈ రాశివారికి అభయాంజనేయస్వామి ఆరాధన అన్ని విధాలా శుభదాయకం.

వృషభ రాశి: 

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 

ఆదాయం: 2 వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం: 3

ఈ రాశివారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి. సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. అవకాశాలు అందినట్టే జారిపోతాయి. ఆత్మస్థైర్యంతో మెలగాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు, తరచు కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్ధం నవంబరు నుంచి కలిసివచ్చే సమయం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. సంతానానికి వివాహ, ఉద్యోగ యోగం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. 

ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెట్టుబడులు, సంస్థల స్థాపనలపై దృష్టి సారిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థానచలనం. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శనీశ్వరునికి తైలాభిషేకం, రాహు, కేతువుల పూజలు ఈ రాశివారికి ఆశించిన ఫలితాలిస్తాయి.

మిథున రాశి : 

మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం 5, వ్యయం : 5, రాజపూజ్యం: 3, అవమానం 6

ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయంలోను తొందరపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. నూతన పెట్టుబడులు కలిసిరావు. వివాహయత్నం ఫలిస్తుంది. వధూవరుల జాతక పొంతన ప్రధానం. దంపతులు మధ్య తరుచు కలహాలు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 

సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త. తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. సంతానం వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర లభించదు. చేతివృత్తులు, కార్మికులకు ఆశాజనకం. ఈ రాశివారికి సూర్యభగవానుని ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం శుభదాయకం.

కర్కాటక రాశి : 

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 

ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6

గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులతో జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచు ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు చేయించుకోవటంలో అలక్ష్యం తగదు. 

దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. తరచు శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కష్టసమయం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భనూతన వ్యాపారాలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు. బిల్డర్లకు ఆశాజనకం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల సందర్శనకు పాస్‌పోర్టు, వీసాలు మంజూరవుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శుభదాయకం. 

సింహ రాశి : 

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 

ఆదాయం: 2 వ్యయం: 14, రాజపూజ్యం: 2, అవమానం 2

ఈ రాశివారి గోచారం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వంటి చికాకులెదుర్కుంటారు. రుణదాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పనుల్లో అంతరాయాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కృషిలో ఓర్పు. చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు. సంతానం విద్యా విషయంలో ఒకింత నిరుత్సాహం తప్పదు. 

పత్రాల సవరణలు అనుకూలించవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి నిరాశాజనకం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన ఈ రాశివారికి శుభం, జయం.

కన్య రాశి : 

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 

ఆదాయం 5, వ్యయం: 5, రాజపూజ్యం: 5, అవమానం: 2 

ఈ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్పసిద్ధి, వ్యవహారజయం పొందగలరు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు, వాహనం అమర్చుకోగల్గుతారు. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం నెరవేరగలవు. తరచు శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభ సమయంలో ఆటంకాలెదుర్కుంటారు. శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో వ్యవహరించండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.  

అధికారుల తీరును గమనించి మెలగాలి. ఉపాధ్యాయులు తరచు ఒత్తిళ్ళలకు గురవుతుంటారు. ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. పన్నుల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం. దిగుబడి బాగున్నా మద్దతు ధర సంతృప్తినీయదు. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. తరచు ఆలయాలు సందర్శిస్తారు. అసాంఘిక కార్యకాలాపాల జోలికి పోవద్దు. ఈ రాశివారికి శ్రీ కనకదుర్గమ్మ, మల్లేశ్వరసామిల ఆరాధన అన్ని విధాలా శుభదాయకం.

తుల రాశి : 

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5

ఈ రాశివారి వారి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్ధిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో కలహాలు, తలపెట్టిన పనుల్లో చికాకులు అధికం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం. శ్రేయస్కరం. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగస్తుల సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. అధికారులకు వేధింపులు, స్థానచలనం. 

ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లభించదు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ఆటుపోట్లు తప్పవు. హోల్సేల్ వ్యాపారులకు బాగుంటుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. వాహన, అగ్ని ఇతరత్రా ప్రమాదాలు ఎదురవుతాయి. తరచు దైవకార్యాల్లో పాల్గొంటారు. మూడు నెలలకొకసారి శనికి తైలాభిషేకం, రాహుకేతువుల పూజలు ఈ రాశివారికి కలిసిరాగలవు.

వృశ్చిక రాశి : 

విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు

ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం : 4 అవమానం: 5

ఈ సంవత్సరం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఎవరిపైనా ఆధారపడవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. తరచు చేబదుళ్లు, రుణాలు చేయవలసి వస్తుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తరుచు శుభకార్యాల్లో పాల్గొంటారు. వాస్తుదోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 

కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. గృహనిర్మాణాలు చేపడతారు. బిల్డర్లు, కార్మికులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. విష్ణు సహస్ర నామ పారాయణం, కనకధారా స్తోత్రములు ఈ రాశివారికి మంచి ఫలితాలిస్తాయి.

ధనస్సు రాశి: 

మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం: 7, అవమానం 5

ఈ రాశి అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. సంకల్పసిద్ధి. వ్యవహార జయం ఉన్నాయి. వ్యవహార పరిజ్ఞాంతో రాణిస్తారు. యత్నాలకు సన్నిహితులు సహకారం అందిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవివాహితులకు శుభయోగం. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురవుతాయి. దంపతుల మధ్య సభ్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. స్థిరచరాస్తుల కొనుగోళ్లకు అనుకూలం. దళారులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వ్యవసాయ రంగాల వారికి రెండో పంట ఆశించిన దిగుబడినిస్తుంది. పంటకు తగిన మద్దతు ధర పొందుతారు. సంకల్పసిద్ధికి శివదర్శనాలు, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శభదాయకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. టెండర్లు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థుల విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశివారికి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం శుభాన్నిస్తాయి.

మకర రాశి : 

ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు

ఆదాయం 14, వ్యయం: 14, రాజపూజ్యం: 3, అవమానం 1

గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహనిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. తరచు వైద్యపరీక్షలు చేయించుకోండి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. వీరికి పదోన్నతి, స్థానచలనం ఉన్నాయి. 

వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటె రబీ సీజన్లోనే దిగుబడి బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులెదురవుతాయి. వ్యాపారవర్గాలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరుచు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ రాశివారికి వరసిద్ధి వినాయక ఆరాధన, లలితా సహస్ర పారాయణం శుభదాయకం.

కుంభరాశి : 

ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు 

ఆదాయం 14, వ్యయం: 14 రాజపూజ్యం : 6, అవమానం 1

ఈ రాశివారికి ఏలిననాటి శనిప్రభావం, గురుబలం లోపం అధికంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఊహించని ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఆచితూచి అడుగేయాలి. దంపతుల మధ్య ఆకారణ కలహాలు. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కుంటారు. మనస్థిమితం ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వాస్తుదోష నివారణ చర్యలు తప్పనిసరి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. వీరు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు. దూరప్రాంతంలోనే ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి వంట బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర పొందుతారు.

వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ట్రాన్స్పోర్టు రంగాల వారికి ఆదాయాభివృద్ధి. న్యాయవాదులు, వైద్యులకు సామాన్యం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నం ఫలిస్తుంది. తరచు విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఈ రాశివారికి కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణం, శనికి తైలాభిషేకాలు క్షేమదాయకం.

మీన రాశి : 

పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం: 4

ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించి భంగపాటుకు గురవుతారు. అందరితోను కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య తరచు కలహాలు, చికాకులు తలెత్తుతాయి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు.

నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టాలు, చికాకులు అధికం. చిన్నతరహా వ్యాపారులకు సామాన్యం. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యలాపాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలరు. తరుచు పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనం కలిగిస్తాయి. ఈ రాశివారికి తరచు శివాభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు శుభం.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

Tags : panchangam , telugu festivals , 2024 , Daily panchangam , telugu festivals 2024 , telugu 2024 festivals , bhakthi margam , december 2024 rashi phalalu , rashi phalalu  ,  Children 2024 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు, monthly rasi phalalu in telugu 2023, rasi phalalu 2024 to 2025 in telugu, mulugu rasi phalalu 2024to 2025 pdf, gantala panchangam 2024 to 2025 , ttd telugu panchangam 2024 to 2024 ,rasi phalalu in telugu 2024, today rasi phalalu in telugu 2024, today panchangam, today rasi phalalu in telugu 2024, rasi phalalu in telugu 2024, 2024 rasiphalalu

Comments