వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు? | Vaikunta Ekadashi 2023 | Bhakthi Margam


వైకుంఠ ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు?

వైకుంఠ ఏకాదశి అంటే

ఎవరైనా మోక్షం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థం. 

వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరచుకునే ఈ పర్వదినాన శ్రీ హరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం, ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడాని, అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఈసారి ఏకాదశి ఎప్పుడొచ్చిందంటే

ఈ నెల అంటే డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం 9:38 గంటల వరకు ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి డిసెంబర్ 23న శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం 7 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. అయితే సూర్యోదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 23న జరుపుకుంటారు. 

ఉత్తర ద్వార దర్శనం

ఇట్టి పర్వదినం ప్రతి సంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్య క్షేత్రాలలో మామూలు రోజులలో అయితే ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆరోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నాన సంధ్యాదులు ముగించుకుని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తరద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తారని చిలకమర్తి తెలిపారు.

పూజా విధానం

వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి, మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫొటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరంమైన వారికి ఆహారం అందించాలి.

ఉపవాస దీక్ష

ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు.. ఉప+ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశ్యం.
Tags : Sri mahavishnuvu, vaikunta ekadashi, ekadashi, mukkoti ekadashi, 2023vaikunta ekadashi, 2023 mukkoti ekadashi, Pooja Vidhanam, importance of mukkoti ekadashi, importance of vaikunta ekadashi, December month 2023 festivals, bhakthi Margam, bhakthi Margam.in

Comments