41 రోజు అయ్యప్ప స్వామి దీక్షా నియమాలు
కార్తీక మాసం నుంచి.. మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. 41 రోజుల పాటు.. కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. ఈ దీక్షలో నియమాలకు చాలా ప్రాధన్యత ఇస్తారు. వీటికి శాస్త్రపరంగానే కాదు.. వారి ఆరోగ్యపరంగా కూడా నియమాలను రూపొదించారు. మరి ఆ నియమాలు ఏంటి.. వాటి వెనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయ్యప్ప స్వామి భక్తులు కార్తీకమాసం నుంచి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు కఠినమైన నిమయాలు పాటిస్తూ అయ్యప్ప మాల వేసుకుంటారు. అప్పటివరకు ఎలా ఉన్నా.. మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు కచ్చితంగా మార్చేసుకుంటారు. స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడుపుతూ.. సాత్విక జీవనం అవలంభించుకుంటారు.
తెల్లవారుజామునే చన్నీటి స్నానంతో మొదలయ్యే నియమాలు.. రాత్రి నేలపై పడుకోవడంతో ముగుస్తాయి. ఇలా ఒకటా, రెండా.. ఒక మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో పాఠిస్తారు. ఆ నియమాల గురించి.. వాటి వెనుక రీజన్స్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఆ నియమాలు ఎందుకు పాటించాలో.. అసలు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయ్యప్ప దీక్షా నియమాలు
* గురుస్వామి, తల్లిదండ్రులు, అర్చకస్వామి ద్వారా మాల ధరించాలి.
* ముందు రోజు మద్యం, మాంసం తినరాదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజులు ఈ దీక్ష పూర్తి చేయాలి.
* అయ్యప్ప మాలధారులు నలుపు రంగు వస్త్రాలు ధరించాలి.
(అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు. ఎందుకంటే శని దేవుడికి నల్లని రంగు అంటే మక్కువ. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏ మాత్రం ఉండదని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు చలికాలంలోనే అయ్యప్పమాలను ధరిస్తారు. కాబట్టి ఆ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు.)
మాల ధరించిన నాటి నుంచి.. స్వామి అనే పిలవాలి.
స్వాములు నేలపైనే నిద్రించాలి. పరుపులు, దిండ్లు పాదరక్షలు వాడకూడదు. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో బ్రాహ్మచారిత్వం పాటించాలి. పగలు నిద్రించకూడదు.
ఆరుసార్లు శబరి యాత్రకు బయలుదేరి మకరజ్యోతిని దర్శించుకున్న గురుస్వామితో మాల స్వీకరించాలి. స్వీకరించే ముందు బ్రహ్మదేవుని చందనంగా, శివుడిని విభూదిగా, విష్ణువును కుంకుమ రూపంగా భావించి నుదిటిపై దిద్దుకోవాలి.
మాలధారులు మండల దీక్షను పూర్తి చేసుకోవడానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థలం ఉంటే పీఠం పెట్టుకోవచ్చు. అలా వీలుకాకుంటే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు. సన్నిధానంలో ఎత్తయిన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప స్వాముల చిత్రపటాలను ప్రతిష్ఠించాలి.
మండల దీక్ష కోసం సంకల్పం తీసుకొని కలశస్థాపన చేయాలి. ఒకసారి కలశ స్థాపన జరిగాక దీక్ష ముగిసేవరకు కదిలించకూడదు. దేవతామూర్తుల చిత్రపటాలకు శిరుస్సు నుంచి పాదాల వరకు అలంకరణ చేయాలి.
దీపారాధన చేసిన అనంతరం ముందుగా గణపతి స్వామి, అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామిని పూజించిన పిదప అయ్యప్ప పూజ నిర్వహించాలి.
మొదటిసారి మాలధరించిన స్వామిని కన్నెస్వామి అని, రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, నాలుగో సారి గదస్వామి, ఐదోసారి పెరుస్వామి, ఆరు నుంచి 18వ సారి వరకు వివిధ పేర్లతో పిలుస్తారు.
మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానమాచరించి సూర్యోదయం కాకముందే పూజనుముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి.
సూర్యుడు నెత్తిమీదికి వచ్చాక మధ్యాహ్నం మూడు గంటలలోపు భిక్ష చేయాలి. సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీకరించాలి.
మలవిసర్జనకు వెళ్తే తిరిగి స్నానమాచరించి స్వామివారి శరణుఘోష చెప్పి హారతి తీసుకోవాలి.
అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య, అనబడే పదునెట్టాంబడికి దూరంగా ఉండాలి.
తన శక్తికొలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి.
పగలు బిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. బిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు. కానీ బయటి తినుబండారాలు తినకూడదు.
* ఉదయం, సాయంత్రం రెండు పూటల చన్నీటితో స్నానం చేయాలి. వేకువజామునే నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్పస్వామికి పూజ చేయాలి.
* అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు. అవసరమైతే తప్పా దూర ప్రయాణాలు చేయకూడదు.
* నిద్రించేప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* దీక్షలో ఉండగా రక్తసంబంధీలకులు, దగ్గరి బంధువులు, దాయదులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి.
(తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి.)
* నడిచే దారిలో శవం ఎదురైనా.. జన సందోహంలో తిరిగినప్పుడు రజస్వల, బహిష్టు అయిన వారు ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణుఘోష చెప్పాలి.
* స్వాములు చేసే దీక్ష, పూజ, భుజించే బిక్ష, నిద్ర సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి.
* దీక్షా సమయంలో గడ్డం గీసుకోవడం, క్షవరం చేయించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు.
* ఇంట్లోనే వేరైన గదిలో ఉండాలి. నిత్యం స్వామి భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి.
* స్వామికి నెయ్యితో అభిషేకం చేసి.. అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిదానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి.

Comments
Post a Comment