కార్తీక మాసంలో సోమవారం ఉపవాసం ఎందుకు?
తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు.
కార్తీక మాసమంతా దైవనామస్మరణతో మార్మోగిపోతుంటుంది. కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు పెద్ద క్రతువులేమీ చేయనవసరం లేదు. కోరి ఖర్చుపెట్టాల్సిన అవసరమూ లేదు. కావల్సిందల్లా నిష్ఠ! పాటించవలసిందల్లా నియమం! అలాంటి ఒక నియమమైన ఉపవాసం గురించి…
సోమవారం ఉపవాసం
కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడయినా సరే - స్నాన, జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. అలాగే శివసాయుజ్యాన్ని పొందుతారని `కార్తీక మహాపురాణం` చెబుతోంది. మరియు అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని 'ధర్మసింధువు' గ్రంథం తెలుపుతున్నది.
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారంనాడూ ఉపవాసాన్ని ఆచరించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరమే భోజనాన్ని చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారని `కార్తీక మహాపురాణం` చెబుతోంది. ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ మన పెద్దలు ఉపవాసానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో, అలాగే మన జీర్ణవ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.
వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మన జీర్ణవ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారవుతాము. అంతేనా! మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే శరీరం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే మగతగా అనిపించడానికి ఇదే కారణం! అలా కాకుండా ఒక రోజంతా కనుక శరీరాన్ని తన మానాన వదిలేస్తే… దానికి ఉన్న రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. శరీరంలోని మూలమూలలా ఉన్న దోషాలను ఎదుర్కొని, అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది.
1. ఉపవాసము 2 ఏకభక్తము 3 నక్తము 4 అయాచితము 5.స్నానము 6.తిలదానము
ఉపవాసము:
శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము (ఉపవాసము)తో గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరమున తులసితీర్ధము మాత్రమే సేవించాలి.
ఏకభక్తము:
సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసికొని - మధ్యాహ్నమున భోజనము చేసి, రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ తీర్ధమో మాత్రమే తీసుకోవాలి.
నక్తము:
పగలంతా ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని, ఉపాహారమును గాని స్వీకరించాలి.
అయాచితము:
భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా - వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము"
స్నానము:
పై వాటికి వేటికీ శక్తి లేని వాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును.
తిలదానము:
మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది.
పై ఆరు పద్ధతులలో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. ఈ వ్రతాచరణము వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీకమాసములో వచ్చే ప్రతి సోమవారము నాడూ కూడా పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ - ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపే వాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసే వాళ్లు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి.
ఉపవాసం ఎవరు ఉండ కూడదు అంటే
ఎనిమిదేండ్లలోపు పిల్లలు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సినవారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలు పేర్కొన్నాయి.
ఇక గృహస్తులు, సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు తప్పక ఈ దీక్షను ఆచరించాలి.
మానసికంగా కూడా దాని ప్రభావం అమోఘం. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్నీ, మనసునీ కూడా ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే… మనం తినే ఆహారమే మన ఔషధం! విపరీతమైన కారం తింటే ఒకరకమైన ఆలోచన కలుగుతుంది, విపరీతమైన పులుపు తింటే మరోరకమైన ఆలోచనలకు ప్రోత్సహం ఉంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తల్చుకునేందుకు, అన్ని మతాలవారూ ఉపవాసాన్ని ప్రోత్సహించారు. కడుపులో ఎలాంటి ఆహారమూ లేనప్పుడూ, భగవన్నామస్మరణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
హైందవ ఆచారాలలో కూడా ఏదో ఒక సందర్భంగా ఉపవాసాలని జోడిస్తూనే వచ్చారు. కనీసం పదిహేను రోజులకి ఒకసారన్నా ఉపవాసం ఉండేలా ఏకాదశినాడు ఉపవాసం ఉండమని సూచించారు. అదీ ఇదీ కాదంటే కనీసం కార్తీక సోమవారాలలో అన్నా ఉపవాసం ఉండమని చెబుతున్నాయి మన శాస్త్రాలు.
ఇక ఉపవాసాల కోసం కార్తీకమాసాన్నే ఎంచుకోవడంలో మరో ఔచిత్యం ఉంది. బయట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది. అలాగని చలి మరీ ఎక్కువగా ఉంటే, శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు కూడా ఎంతో కొంత శక్తి అవసరం అవుతుంది. నవంబరు మాసంలో ఉండే ఉష్ణోగ్రతలు మరీ అసాధారణంగా లేకుండా ఉపవాసానికి తగినట్లుగా ఉంటాయి. ఇక శరీరాన్ని అదుపులో ఉంచేందుకు, మనసుని శివపరం చేసుకునేందుకు కార్తీకమాస ఉపవాసాలని మించి ఏముంటాయి.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags: karthika masam somavaram upavasam, karthika masam fasting rules, karthika masam fasting rules in telugu, karthika pournami fasting rules, karthika somavara vratham fasting rules, karthika somavaram upavasam ela cheyali, karthika somavaram pooja vidhanam in telugu, karthika somavaram 2023, karthika masam 2023, Bhakthi Margam, bhakthimargam, bhakthimargam.in, bhakthimargam.com,bhaktimargam, bhaktimargam.in

Comments
Post a Comment