శివపంచాక్షరి స్త్రోత్రం | shivapanchakshari stotram and meaning in telugu | bhakthi margam

 

శివపంచాక్షరి స్త్రోత్రం

కార్తీక మాసంలో భక్తులు నిత్యమూ శివభక్తిలో లీనమయ్యేందుకు, అనేక నియమాలను ఏర్పరిచారు పెద్దలు. `శివపంచాక్షరి స్తోత్రాన్ని`ని జపించాలనడం వాటిలో ఒకటి! శివపంచాక్షరి అంటే శివుని తల్చుకునేందుకు జపించే అయిదు అక్షరాల మంత్రం. అదే `నమః శివాయ`. ఆ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి ఒక స్తోత్రాన్ని రూపొందించారు ఆదిశంకరులవారు.

అదే శివపంచాక్షరి స్తోత్రం! స్తుతించేందుకు రాసేది `స్తోత్రం`. కానీ ఆదిశంకరుల వారి రచనలు కేవలం స్తుతించవు… దర్శిస్తాయి! భగవంతుని రూపాన్నీ, ఆయన చుట్టూ ఉన్న ప్రదేశాన్నీ, అక్కడ ఉన్న వాతావరణాన్నీ…. అన్నీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. స్తోత్రాన్ని సైతం గొప్ప కవిత్వంలా రాసినవారు శంకరులు. అందుకు మచ్చుతునక అయిన శివపంచాక్షరి స్తోత్రాన్ని మనఃస్ఫూర్తిగా స్మరించుకుందాం! దాని అర్థాన్ని ఒకసారి తరచిచూసుకుని శంకరులవారి భావ పారవశ్యానికి ముగ్ధులవుదాం!

ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ |

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||


- సాక్షాత్తూ ఆ నాగేంద్రునే హారంగా కలిగిన త్రినేత్రుడు; భస్మమే ఆచ్ఛాదనగా, దిక్కులే వస్త్రాలుగా కలిగిన మహేశ్వరుడు;

ఏ రకమైన మలినమూ సోకని శుద్ధుడు; అలాంటి శివునికి వందనం.

మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||

- ఉత్తారదిన మొదలయ్యే నదులలో ప్రముఖమైనది మందాకినీ నది. ఇది ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్‌నాథ్‌ వద్ద ప్రారంభమవుతుంది. మందగమనంతో హుందాగా, గంభీరంగా ప్రవహిస్తుంది కాబట్టి దీనికి మందాకిని అన్న పేరు వచ్చింది. కానీ మందాకినికి వరద కనుక వస్తే, ఉత్తరాది అంతా అతలాకుతలం అయిపోతుంది.

అలాంటి మందాకిని జలాలతోనూ, చందన లేపనంతో పూజింపబడేవాడు అంటారు ఆదిశంకరులు. నందీశ్వరాది ప్రమథగణాలకు నాయకుడు; అతి సాధారణమైన మందారపుష్పం మొదలుకొని అనేకానేక పుష్పాలతో పూజింపబడేవాడు అయిన శివునికి వందనం అంటున్నారు ఆదిశంకరులు.

శివాయ గౌరీ వదనాబ్జ బృంద

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |

శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ

తస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||

- సూర్యుడు ఎలాగైతే కమలాన్ని వికశింపచేస్తాడో… శివుడు తన పట్ల చూపే అనురాగానికీ, భక్తుల పట్ల చూపే మహిమకూ పొంగిపోయే గౌరీదేవి ముఖం ఆయనవల్ల వికసిస్తుందట. (చాలామంది కమలం రాత్రిపూట వికసిస్తుందనుకుంటారు. నిజానికి రాత్రిపూట వికసించే కమలం మనం రోజూ చూసేది కాదు. హిమాలయాల వంటి ప్రాంతాలలో అరుదుగా కనిపించే `బ్రహ్మకమలం` అనే పుష్పం. మామూలు కమలం సూర్యునితోనే వికసిస్తుంది).

- ఇక దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసినవాడు శివుడు. సాక్షాత్తూ శివునికి మామగారు అయినప్పటికీ… దక్షుడు అహంకారంతో ఆ పరమశివుని అవమానిస్తూ యజ్ఞాన్ని నిర్వహించాడు. అలాంటి దక్షయజ్ఞాన్ని నేలమట్టం చేసి అతని అహంకారాన్ని నిర్మూలించాడు శివుడు. దక్షుడంతటివాడి అహంకారాన్నే త్రుంచగలిగిన ఆ పరమశివుని పూజిస్తే, మనలోని అహంకారం సైతం భస్మీపటలం అయిపోతుంది కదా! అలాంటి గరళకంఠుడు, తన జెండా మీద వృషభాన్ని  గుర్తుగా కలిగిన వాడు అయిన శివునికి వందనం.

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ |

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||

- వశిష్ఠుడు, అగస్త్యుడు (కుండలో పుట్టినవాడు కాబట్టి ఈయనను కుంభోధ్భవుడు అని కూడా అంటారు), గౌతముడు వంటి గొప్ప మునీంద్రులతోనూ, దేవతలతోనూ పూజింపబడేవాడు; చంద్రుడు, సూర్యడు, అగ్నిని మూడు నేత్రాలుగా కలిగినవాడు అయిన ఆ పరమశివునికి వందనం.


యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ |

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||

- కోరికలను తీర్చే యక్షునిలా కనిపించినా, దుష్టులను దండించే శూలాన్ని ధరించినా… ఆ జటాధరునికి, దివ్యపురుషునికి, దిగంబరునికీ వందనం!

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

ఇది ఫలశ్రుతి! శివసన్నిధిలో ఈ పంచాక్షరాలని ఎవరు పఠిస్తారో వారికి శివలోక ప్రాప్తితో పాటు, అక్కడి పారవశ్యం కూడా దక్కుతుంది. అలాగని ఈ స్తోత్రాన్ని గుడిలోనే పఠించాలని ఏమీ లేదు. మనసులో శివుని నింపుకున్నా, అది `శివసన్నిధే` అవుతుంది కదా! ఇక శివుని అణువణువునా నింపుకున్నవారికి, ఈ ప్రపంచమే శివలోకమవుతుంది!

Related Postings:

1. Stotras In Telugu



 


Comments