తిరుప్పావై 8వ పాశురం | Thiruppavai pasuram 8 in telugu | dhanurmasam | Bhakthi Margam | భక్తి మార్గం


తిరుప్పావై 8వ రోజు పాశురము

నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు
ఆండాళ్ తిరువడిగలే శరణం     

8 పాశురము

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటివాలుకు మనం తెర చాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగం వేగం గా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. 

ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అదీ కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పోదాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. "అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే" మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని.  

మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పోందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు. 

మరి ఎం చేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. 

అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది భహుషా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కాదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట భయలుదేరింది.   

మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చేయ్యాలో చెప్పు అని అడిగింది. "ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ" అంటూ ఉపదేషం చేసాడు. హే మైత్రేయీ "ఆత్మావారే ద్రష్టవ్యః " లోపల ఉండే ఆత్మా అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె. కానీ ఎట్లా కనిపిస్తుంది ? ద్రష్టవ్యః - చూడాలి అనుకున్న దాన్ని మొదట "శ్రోతవ్యః" వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి.  మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది.

అండాళ్ తల్లి చెప్పేది ఎదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత.

మొదట పక్షులు అరిస్తున్నాయి అని చెప్పింది, ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది - ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపి రుచి ఏర్పడ్డాక, ఆలయ పిలుపు శఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వని ని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటాం, ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే ముణులు స్మరించువాడు అని తెపిపింది, వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా ముణుల వద్ద ఉపదేషం పొంది మనం ఇక మనం జీవనం సాగించాలి. అలా సాగితే మనం "ద్రష్టవ్యః" అప్పుడు స్పష్టంగా చూడగలం.

"కీళ్" తూర్పు దిక్కున "వానమ్" ఆకాశం  "వెళ్ళెన్ఱ్" తెల్లవారిందని అనుకుని "ఎరు మై" గేదెలన్ని కూడా  "శిఱు వీడు  మెయ్యాన్" చిన్న మేత మేయడానికి "పరందన కాణ్" పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి. సాదారణంగా గేదెలను తామసిక గుణం తో పోలుస్తారు, తెలవారటాన్ని సత్వంతో పోలుస్తారు. 

ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం భాగుపడే ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు-"రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే" మనలోపలుండే సర్వ రసుడు, సర్వ గంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటకి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీముఖ కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకనిపిస్తుంది, ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోప బాలిక లేవలేదు. 

"మిక్కుళ్ళ పిళ్ళైగళుం" మిగతా పిల్లలందరూ "పోవాన్ పోగిన్ఱారై" త్వరత్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే "ప్పోగామల్ కాత్తు" వాళ్ళను ఆపి, "ఉన్నైక్కూవువాన్  వందు నిన్ఱోం" నిన్ను కూడా తీసుకు వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. 

ఎందుకంటే, "కోదుగలం ఉడైయ పాపాయ్!" శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కల్గించే గోపికవి కదా నివ్వు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా "ప్రియోహి జ్ఞానినో త్యర్థమాం సచ మమ ప్రియః" జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకూ జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేం వెళ్ళలేం. నీవు మావెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు. "ఎళుందిరాయ్" లేవమ్మా అందరం కలిసి వెళ్దాం. ఇక్కడకు వెళ్ళి  "పాడి ప్పఱై కొండు" మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం. 

"మావాయ్ పిళందానై" గుఱ్ఱం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచివేసాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది. యముడు నచికేతుడికి చెబుతాడు "ఇంద్రియాణి హయానాహుః" శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. 

ఈ ఐదు ఇంద్రియాలు మనను ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే ఖల్లెంతో బుద్ది అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేసాడు.

"మల్లరై మాట్టియ" మథురా నగరిలో మల్ల యోదులైన చాణూరుడు ముష్టికుడులను ఖంసుడు శ్రీకృష్ణ బలరాములని సంహరించడానికి ఎర్పాటుచేసాడు. వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు, కృష్ణ బలరాములు వారి మద్యకి వెళ్ళి, ఇరువురు వారిని వారే సంహరించుకొనేట్లు చేసారు. మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామ క్రోదాలు ఈ మల్ల యోదులవంటివే అని గమనించాలి.

మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం, ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. పూరణైరేవ కన్యతే- దేనితోనైతె నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి. అగ్నికి కావల్సింది ఇందనం, ఇందనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి.  

రావణ వద అనంతరం, హే రావణా ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు, నిన్నా వీరు అణిచివేసింది, నీలోని కామ క్రోదాలను పైకి లేపుకున్నావు వాటితోనే నిన్ను నేవే చంపుకున్నావు! అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు. కృష్ణుడివైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించివేస్తాడు. 

"దేవాది దేవనై" ఆయన దేవాది దేవుడు,  మనల్ని ఆయన ఎప్పుడు వదలడు. ఇన్నాళ్ళూ మనం నీవాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్క సారి అను. ఏమని "చ్చెన్ఱు నాం శేవిత్తాల్" ఒక్క సారి మనం చేరి తండ్రీ మేము నీవారవని తెలిపితే చాలు.  "ఆవా ఎన్ఱ్ ఆరాయ్ అంద్ అరుళ్" మన కోసం ఆయనే తపిస్తాడు. 

ఇక్కడ మనం రామాయణం లోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు, అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొర పెట్టుకున్నారు. రాముడు నేను అయోద్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని, తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గు పడ్డాడు. 

ఇదీ పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మనకోసం తపిస్తాడు. తిరుమరిసై ఆళ్వార్,ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు, ఆయన కాంచీ పురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు.

దానికి ఆయనదేవున్ని పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు అని అన్నాడు, దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారూ  బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే వెళ్తాననడం తో, రాజుగారు ఇద్దరిని బతిమిలాడి తీసుకువచ్చాడట.  ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. యదోక్తకారి- ఎలా చెపితే అలా వినే పెరుమాళ్ అని అర్థం ఇది కాంచి పురంలో ఒక ఆలయం. 

అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: thiruppavai pasuram in telugu lyrics,thiruppavai telugu pdf with meaning, thiruppavai pravachanam in telugu pdf, thiruppavai pravachanam by chinna jeeyar swamy, thiruppavai pdf telugu, thiruppavai pasuram in telugu lyrics, goda devi pasuram in telugu pdf, goda devi ashtottara shatanamavali in telugu, goda devi story in telugu, bhakthimargam, bhakthi margam, bhakthi margam telugu, bhaktimargam, bhakti margam, thiruppavai pasuram in telugu mp3 free download, thiruppavai mp3 free download tamil m.s. subbulakshmi, thiruppavai in telugu pdf free download, thiruppavai telugu books, thiruppavai pasuram 3 meaning, thiruppavai 8th pasuram in telugu, thiruppavai pasuram 8 in telugu

Comments