కార్తీక పురాణం 3 వ అధ్యాయం | karthika puranam day 3 in telugu | bhakthi margam



 కార్తీక పురాణం 3 వ అధ్యాయం


కార్తీక స్నాన మహిమ

జనకమహారాజా! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక, కార్తీక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునయినను స్నాన, దాన, జపతపాదులు చేయకపోవుటవలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.

బ్రహ్మ రాక్షసులకి ముక్తి కలుగుట

ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడూ అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను.

 ఆ తీర్థ సమీపమున ఓ మహా వటవృక్షంపై భయంకరమైన ముఖముతోను, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోను, నల్లని బానపొట్టల తోనూ, చూచు వారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి, వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి.

తీర్థ యాత్రకై బయలుదేరి, అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు జూచి, గజగజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచూ 'ప్రభో! ఆర్తత్రాణ పరాయణ! అనాధ రక్షక! ఆపదలోనున్న గజేంద్రుని రక్షించిన విధము గానే యీ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి!' అని వేడుకొనెను.

ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి 'మహానుభావా! మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగింది. మహానుభావ! మమ్ము రక్షింపుడూ అని ప్రాధేయపడిరి. s s

వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, 'ఓయీ! మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడూ అని పలుకగా, వారు 'విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శనభాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదూ అని అభయమిచ్చినవి.

అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను.

నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడినైయుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద, దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా, పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరుచుచూ, లుబ్ధుడనై లోకకంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను.

వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్ద నున్న ధనమును, వస్తువులను తీసుకొని యింటి నుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి 'ఓరీ నీచుడా! అన్యాక్రంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డాలు తెలియక, తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి, తిట్టీ వస్తుసామగ్రిని దోచుకుంటివి గాన, నీవు రాక్షసుడవై నర భక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువు గాకా అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. 

బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా! కాన నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకాతడు దయతలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము కలదు. నీవందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువు గాకా అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షసరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్ను, నా కుటుంబము వారను రక్షింపు డని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు, 'ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేనూ నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి, వారికి తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా అనునటుల చేసి, వారి ఎదుటనే నా భార్యబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడిని. నేను ఎట్టి దాన, ధర్మములను చేసి యెరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగినది అని చెప్పెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. 'మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణ్వాలయంలో అర్చకునిగా వుంటిని. స్నానమైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడిని.

భగవంతునికి ధూప, దీప, నైవేద్యములు అర్పించక, భక్తులు కొని దెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచూ మద్య, మాంసములను సేవించుచూ, పాపకార్యాలు చేసినందున, నా మరణాంతరమున ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను.

ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు రాక్షసుల దీనాలాపములాలకించి, 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపము కలిగెను. 

నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతునూ అని వారినోదార్చి తనతో గొని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని, తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి, స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా, వారివారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి.

కార్తీక మాసమున గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తినొంది, వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నించి అయినా సరే కార్తీకస్నానాలనాచరించాలి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహత్మ్యమందలి మూడవ అధ్యాయము

మూడవ రోజు పారాయణము సమాప్తము.

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

Tags: karthika puranam first day story in Telugu, karthika puranam telugu, karthika masam 2023, karthika masam 2023 start date telugu, karthika puranam story in telugu, karthika masam visistatha by chaganti koteswara rao, karthika puranam by chaganti, karthika masam story in telugu, karthika puranam by bhakthi margam, Importance of Karthika Masam, karthika masam upavasam ela cheyali, karthika masam pooja vidhanam in telugu, karthika masam fasting Rules, karthika puranam full in telugu, కార్తీక పురాణం 3 వరోజు కథ  Karthika Puranam 3rd Day Karthika Puranam in Telugu  , Bhakthi Margam, Bhakthi Margam telugu, Telugu Bhakthi margam, Bhakti margam, bhakti margam telugu, bhakthimargam.com, bhakthimargam.in

Comments