భోగి పండుగ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ? | significance and importance of bhogi | Bhogi history in telugu | Makara Sankranti | Bhakthi Margam


భోగి: భోగభాగ్యాల పండుగ

హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఇక, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని నిర్వహిస్తారు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. 

దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి భూమికి దూరంగా జరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణానికి ముందురోజు చలి విపరీతంగా పెరగడంతో దీనిని తట్టుకునేందుకు మంటలు.. దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారు. అయితే, ఈ పండుగ రోజున భోగి మంటలు వెనుక పురాణం కథనం, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి

సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక, భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో, పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి.

భోగి మంట వెనక మరో విశేషం కూడా ఉంది. 

భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చింది. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం. 

బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదేనంటారు. శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనం నందిని భూమికి పంపిన రోజు ఇదే అనేవి కూడా పురాణ గాథ.


సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణసంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు. భోగిమంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగిమంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా రగిలించాలట. ఇందుకోసం సూర్యాదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపచేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది.

ఇక భోగిమంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను, పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. 

ఇలా పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. కానీ కాలం మారింది. రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలని కూడా భోగిమంటల్లో వేస్తున్నారు. వాటిని భగభగా మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటి ఇంధనాలని వాడేస్తున్నారు.

ఇలాంటి భోగిమంటల వల్ల వెచ్చదనం మాటేమోగానీ, ఊపిరితిత్తులు పాడవడం ఖాయమంటున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాయిల్‌ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణమూ కలుషితం కావడం ఖాయం. మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవునెయ్యి ఉపయోగించి భోగిమంటలు వేయలేకపోవచ్చు. 

కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోనన్నా భోగిమంటలు వేసుకోమన్నది పెద్దల మాట. అలా నలుగురికీ వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్నీ అందించే భోగిమంటలు వేసుకోవాలా! లేకపోతే నాలుగుకాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సంప్రదాయాన్ని ‘మంట’ కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి.
tags: bhogi in telugu, bhogi wishes in telugu, bhogi story in telugu,bhogi muggulu, bhogi subhakankshalu in telugu, bhogi history in telugu,sankranthi history in telugu, sankranti history in telugu, సంక్రాంతి విశిష్టత,  Makar Sakranti significance, bhakthi margam, daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam, Bhakthi Margam, bhakthimargam.in, 

Comments