తులసి పూజ - తులసి ప్రాశస్త్యమ్
శ్లో|| యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతా
య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్ ||
శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" యొక్క మూలంలో సర్వతీర్ధాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర-తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కధలు కానవస్తున్నాయి. వాటిలో ఒకగాధను సమీక్షించుకుందాం!
"బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది.
అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను.
ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను. అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతి వాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను.
ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను.
అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదతమగుచున్నది.
ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకుం చేర్చుకుని; పుత్రా!
"పుత్రా! సకల వృక్షములలోన తులసియొక్కటయే
పూజ్యమైక క్ష్మారుహంబు దాని పత్రములను దాని
పుష్పములను బ్రాణ సమములగును అచ్యుతనకు."
మరియు వృక్షాలన్నిటియందు తులసి శ్రేష్ఠమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. "తులసిపూజ" తులసీ స్త్రోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం, తులసీవనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో! పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసీవనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.
శ్లో|| వశిష్ఠాది ముస్తోమై: పూజితో తులసీవనే
తదా ప్రభృతి యద్విష్ణు : బ్రతిజ్ఞాం కృతవాన్ ప్రభు:
తస్మిన్ తులస్యాంతు య: పూజాంకురు తేనర:
సర్వపాప వినిర్ముక్త : మమసాయుజ్య మాప్నుయాత్.
వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసీ వనమందు పూజలందుకొని నన్ను "కార్తీక శుద్ధద్వాదశి" నాడు విశేషించి ఎవరు బూజచేయుదురో! అట్టివారి సమస్తయొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమయి వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!
శ్లో|| తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్చిన:
యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ
విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.
విష్ణు సాన్నిధ్యముగోరి విష్ణుదేవునకు యేమాత్రమైన ప్రీతి జేయవలయునునని తలచేవారు తులసీ వ్రతమహాత్మ్యము తప్పక వినవలయును. అందునా! ఆ వ్రత కధను "క్షీరాబ్ధిద్వాదశి" రోజున తులసీ కధ వినువార్కి, చదువువార్కి, పూర్వజన్మ కృతమైన దు:ఖములన్నియు తొలగిపోయి విష్ణులోకమును పోందుదురు, అని శంకరునిచే "తులసి" కొనియాడబడినట్లు చెప్పబడినది. అట్టి తులసీ బృందావన మందు ఉసిరిమొక్కతో కలిపి "తులసీధాత్రీ సమేత శ్రీమన్నారాయణుని" ఈ కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీ దళములకు "నిర్మాల్యదోషం" పూజలో ఉండదని కూడా చెప్పబడినది.
కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.
ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ తులసిని ఏడువిధాలుగా వివరించబడినది.
అవి:
1.కృష్ణ తులసి
2. లక్ష్మీతులసి
3.రామతులసి
4. నేల తులసి
5.అడవి తులసి
6. మరువ తులసి
7.రుద్రతులసిగా వివరుస్తారు.
వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట !
కావున ఈ "క్షీరాబ్దిద్వాదశి" వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగాన్ని సర్వులమూ పొందుదాం!
తులసీ పూజతో సర్వదేవతారాధన
ప్రతి మనిషికీ తల్లి తొలిగురువు అని పెద్దలంటారు. ఆ తల్లిని గురువుగా భావించి, గురుదక్షిణ ఇవ్వడం కొద్ది మందికే సాధ్యం. అటువంటి అసాధారణ వ్యక్తులలో సంగీత త్రయంలోని త్యాగరాజును చెప్పుకోవాలి. సంగీత కుటుంబం నుండి వచ్చిన తల్లి సీతమ్మ సంగీతంలోని ఓనమాలు నేర్పి త్యాగరాజు తొలిగురువయింది.
ప్రతి నిత్యం తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తూ, మధురమైన కంఠంతో పురందరదాసు, రామదాసు, అన్నమయ్యల కీర్తనలు తల్లి పాడుతుంటే వింటూ, గొంతు కలిపి పాడుతూ త్యాగరాజు పెరిగాడు. వంశానుగతంగా వచ్చిన శ్రీరామభక్తి, తల్లి సంకీర్తనల ద్వారా మరింత పరిపుష్టమై, త్యాగరాజును అచిరకాలంలోనే గొప్ప సంగీతజ్ఞుడిగా, వాగ్గేయకారుడిగా తీర్చిదిద్దింది.
తన బంగారు భవితవ్యానికి మార్గదర్శకురాలైన తల్లికి గురుదక్షిణ సమర్పించడమే తన ప్రథమ కర్తవ్యమని త్యాగరాజు భావించాడు. తల్లికి అత్యంత ప్రియమైన తులసీమాతపై కీర్తనలు రచించి తద్వారా ఆమెకు సంతృప్తి కలిగించాడు. ఎన్నో ఔషధగుణాలు కలిగి, సౌభాగ్యప్రదాయినిగా ప్రతియింటా వెలసిన తులసీమాతపై త్యాగరాజు రచించిన కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
సావేరి రాగం - రూపకతాళం
ప॥తులసీ జగజ్జననీ దురితాపహారిణీ॥
చ॥చరణ యుగంబులు నదులకు పరమ వైకుంఠమట
సరసిజాక్షి నీమధ్యము సకల సురావాసమట
శిరమున నైగమకోట్లు చెలగుచున్నారట
సరస త్యాగరాజాది వర భక్తులు పాడేరట॥
తులసి మొక్క అడుగుభాగాన శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు. విష్ణుపాదాల నుండే గంగ పుట్టడం వల్ల, నదులకు పుట్టిల్లు వైకుంఠమనీ, విష్ణు నివాసమైన తులసియే వైకుంఠమని, మధ్య భాగంలో సకల దేవతలు కొలువుంటారనీ, శిరోభాగం వేద స్వరూపంగా భాసించడం వల్ల, ఒక్క తులసి మాతను పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లే అని త్యాగరాజు తులసీ మహాత్మ్యాన్ని తెలియపరిచాడు.
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Keywords
how to do tulasi puja at home in telugu,Pooja Vidhanam, పూజ ఇలా చేయండి చాలు ,నిత్యపూజా విధానం,తులసి మొక్క ప్రయోజనాలు మరియు ఉంచవలసిన స్థానం, Benifits & Importance Of Tulasi Plant, for tulasi pooja , tulasi pooja ,about tulasi plant in telugu,tulsi pooja procedure in telugu,తులసీపూజ ,tulasi pooja,The Importance of Tulasi Pooja in Karthika Masam,Tulasi Puja,dwadasi tulasi pooja in telugu pdf,తులసి మాత వివాహ పురాణం , Tulsi matha marriage story in Telugu, Pooja vidhanam, Karthika Pournam,Tulasi Pooja,Puja Vidhi,Tulasi puja Vidhi in telugu
Comments
Post a Comment