బతుకమ్మ వైభవం
సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి).
అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ.బతుకమ్మ పండగ వస్తూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడ పిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో వుండే ప్రతి ఆడపిల్లా ఎప్పుడు కన్న వారింటికి వెళ్ళాలా? కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తూందా? తనను తీసుకు వెళ్ళడానికి అన్న ఇంకా రాలేదే అన్న బాధను వ్వక్త పరుస్తారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ : \నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
చద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.
తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. . ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.
అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.
ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు
మలీద - చక్కెర మరియు రొట్టెతో చేసిన పిండివంటకం
చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.
చీకటి పడుతుంది అనగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది.ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర మరియు రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ వారం రోజులూ, ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.
ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది. ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు. ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి భట్టు ధర్మాంగదుడు భార్య సత్యవతి పుణ్యదంపతుల గర్భాన బతుకమ్మ జన్మించింది. బతుకమ్మ భట్టు రాజులు కులంలో జన్మించింది. సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మ కథ
ఓ ముద్దుల చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరాధివీరులే. అందరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారుబొమ్మని బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆతర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని.భార్యల్ని నిలదీశారు. విషయం అర్థమైంది. తిండీతిప్పల్లేవు, నిద్రాహారాల్లేవు. చెల్లి కోసం వెదకని పల్లెలేదు, ఎక్కని గుట్టలేదు. ఓ వూరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా ... పెద్ద తామరపూవొకటి కనబడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆతర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది! ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం. ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు
ప్రియుని రాకకై ఎదురు చూసే ప్రియు రాండ్లు పాడుకునే పాట...
బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నానోము పండింది ఉయ్యాలో
నీనోము పండిందా ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో
మీవారు వచ్చిరా ఉయ్యాలో
బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట
ఒక్కొక్క వువ్వేసి ||చంద మామ||
ఒక జాము అయే ||చంద మామ||
రెండేసి పువ్వు తీసి ||చంద మామ||
రెండు జాము లాయె ||చంద మామ||
ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతారు. తొమ్మిదవ నాడు బొడ్డెమ్మ చర్చించి కలశంలో, ఆవాడ పిల్లలు ప్రతిదినం చెచ్చి పోసే బియ్యం పరమాన్నం వండి పంచి పెట్టి ఒక బావి దరి చేరి
బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే
బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా
చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా
కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ
నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు
అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. బొడ్డెమ్మ పండుగలో పాడబడే పాటలు ఇంకా కొన్ని వందలున్నట్లు బి. రామరాజుగారు తమ జానపద గేయ సాహిత్యంలో తెలియచేసారు.
కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో ..
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో ..
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో..
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో ...
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో...
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో....
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో ...
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో...
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో...
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో ..
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో..
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో.
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో..
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో...
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో...
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో ...
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో..
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో ...
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో.
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో ...
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో...
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో...
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో..
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో...
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
keywords:
బతుకమ్మ పండుగ విశిష్టత,బతుకమ్మ వైభవం,Bathukamma festival,short essay on bathukamma in telugu,bathukamma story in telugu,9 names of bathukamma in telugu,bathukamma story in telugu pdf,bathukamma in telugu songs,Images for bathukamma in telugu songs,Bathukamma,bathukamma images And Quotes,bathukamma Vedios,bathukamma, 5th day bathukamma, bathukamma celebrations, telangana,Telangana state festival 'Bathukamma',Image result for bathukamma images,బతుకమ్మ చరిత్ర,bathukamma History In Telugu,bathukamma History,బతుకమ్మ,Bathukamma Festival,Importance of Celebrating Bathukamma Festival,Celebrating Bathukamma, traditional festival of Telangana, India, nine day women-oriented festiva,Significations of bathukamma,Bathukamma Top Songs,significations of bathukamma Festival in telugu,








Comments
Post a Comment