Why Is The First Worship Of Ganpati? | Dharma Sandehalu

గణపతికి మొదటి పూజలు ఎందుకు?

ఈ స్వామి నామాలను గురించి, రూప విశేషాలను గురించి గణేశ ఉత్తరతాపిన్యుపనిషత్తు, బ్రహ్మవైవర్తపురాణం గణపతి ఖండం, గణేశపురాణంలాంటి పురాణాలు, ఉపనిషత్తులు చక్కగా వివరించి చెబుతున్నాయి. ఆ స్వామిని పరబ్రహ్మస్వరూపుడు, ఆనందస్వరూపుడు, నిత్యుడు, శుద్ధుడు, ముక్తుడు, స్వయంప్రకాశుడు, ఈశ్వరుడు, పరబ్రహ్మము, పరంధాముడు అని తెలియచెబుతోంది గణేశ తాపిన్యుపనిషత్తు. 


అంతేకాక ఈ విశ్వానికి ఆధారమైన సత్యస్వరూపమే ఆయన. ఆ సత్యమే తనను తాను శ్వేతవర్ణ, గజముఖ, చతుర్భుజ రూపంలో మలచుకొంది. ఆ రూపమే పంచమహాభూతాలను సృష్టించింది. అదే అందరికీ అంతటికీ ఆధారం. ఆ రూపంలోనే సర్వం లయం అవుతుంది. కనుకనే దాన్ని అక్షరపరబ్రహ్మం అని రుషులు, దేవతలు కీర్తించారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ అక్షర పరబ్రహ్మ నుంచే ప్రాణాలు, మనస్సు, ఇంద్రియాలు ఉద్భవించాయి.
ఎప్పటికీ నిలిచివుండే రూపం 
స్వామి దివ్య స్వరూపాన్నే గణేశ సచ్చిదానంద రూపం అని కూడా అంటారు. ఆ రూపమే ఛిద్రూపం, నిర్వికారం, అద్వితీయం అయిన గణేశ్వర ఆనంద రూపం. గణపతి అధర్వశీర్షశ్రుతి వాక్యాల ద్వారా గణపతి అనే శబ్దంలో బ్రహ్మం అనే అర్థమే నిర్దేశితమై ఉంటుంది. ఆ బ్రహ్మమే సచ్చిదానంద స్వరూపం. ఏది సత్యమో అదే చిన్మయం. అదే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్నే ఆనంద రూపం అని అంటారు. ఆ ఆనంద రూపమే ఎప్పటికీ స్థిరంగా నిలిచిఉండే పరమసత్యం. అటువంటి నిత్యస్థితసత్యుడు కనుకనే గణేశుడు తొలి పూజలందుకుంటున్నాడు. ఆ స్వామిని కీర్తించటానికి ఎన్నెన్నో నామాలున్నాయి. అయితే వాటిలో ప్రధానంగా ఎనిమిది నామాలు కనిపిస్తున్నాయి. 

గణేశుడు, ఏకదంతుడు, హేరంబుడు, విఘ్ననాయకుడు, లంబోదరుడు, శూర్పకర్ణుడు, గజవక్త్రుడు, గుహాగ్రజుడు అనేవి ఆ ఎనిమిది నామాలు. గణేశ నామ వివరణ విషయానికొస్తే ‘‘’’ అనే శబ్దం స్వామి వాచకం. ఈ వరుసలో చూస్తే జ్ఞానానికి, నిర్వాణానికి స్వామి కనుక గణేశ్వరుడు అనే పేరు స్థిరపడింది. బ్రహ్మము, పరమాత్మ, పరమేశ్వరుడు, పరమతత్వం అని అనే మాటలకు అర్థం ఆ గణేశ్వరుడే. ఏకదంత శబ్దంలో గొప్ప అర్థం ఉంది. ‘‘ఏక’’ శబ్దం ప్రధానార్థకం. ఏక అంటే ఒకటి. ఒకటి అనే సంఖ్యకు ప్రాధాన్యం ఎంత ఎక్కువన్నది అందరికీ తెలిసిందే. ‘‘దంత’’ అనే శబ్దం బలవాచకం. ఎంతో గొప్పబలమైనది అని దీనికర్థం. ఈ కోణంలో ఏకదంత శబ్దాన్ని పరిశీలిస్తే అన్నిటికంటే గొప్పబలశాలి అనే అర్థం స్ఫురిస్తుంది. ‘‘హేరంబ’’ నామ విషయానికొస్తే అందులోని ‘హే’ అనే అక్షరానికి దైన్యం, దీనత్వం అనే అర్థాలున్నాయి. ‘‘రంబ’’ శబ్దానికి పాలన అని అర్థముంది. 

మొత్తం కలిపి హేరంబ నామానికి అర్థం చూస్తే దీనులను పాలించేవాడు అనే అర్థం వస్తుంది. విఘ్నాలను ఖండించేవాడు లేదా నశింపచేసేవాడు అనే అర్థంలో విఘ్ననాయక నామం కనిపిస్తుంది. విఘ్ననాయకుడి గొప్పతనాన్ని గుర్తించిన విష్ణువు, శివుడు ఆయనకు వివిధ మృష్టాన్నాలను నైవేద్యంగా ఇచ్చారు. వాటిని స్వీకరించిన ఆ గణపతి ఉదరం ఎంతో పెద్దదిగా అయింది. ఆ సమయంలో లంబోదరుడు అనే పేరు వచ్చింది. విశ్వాన్నంతటినీ తన కడుపులో దాచుకొన్న కారణంగా కూడా లంబోదరుడు అనే పేరు స్థిరపడింది.
శూర్పకర్ణ శబ్దాన్ని చూస్తే చేటల వంటి పెద్దపెద్ద చెవులు కలిగి ఉండటం అని అర్థం. చేటలు ధాన్యరాశుల మీద ఉండే దుమ్ము, ధూళి, పొట్టులాంటివాటిని చెరిగి పారేయ్యటానికి ఉపకరిస్తాయి. గణపతికి ఉండే చేటలంత చెవులు భక్తులు మనస్సులలోనూ, జీవితాలలోనూ ఉండే సకల విఘ్నాలను చెరిగేస్తాయనే అర్థంలో ఈ పేరు స్థిరపడింది. గజశిరస్సుతో ఉంటాడు కనుక గజవక్త్రుడు, గజాననుడు అనే పేర్లొచ్చాయి. ఈ గజాననుడే వక్త్రతుండుడిగా ఉంటాడు. అంటే ఆయన తొండం వంకరగా ఉంటుంది. ఆ వంకర తన వైపునకు తిరిగి ఉంటుంది. ఇలా ఉండటంలో కూడా ఓ విశేషార్థం కనిపిస్తుంది. తొండాన్ని నాలుకలా భావించవచ్చు. ఈ నాలుక సరిగా లేకపోతే మనుషులకు ఎన్నెన్నో ప్రమాదాలు వచ్చిపడుతుంటాయి. నాలుకను మాట్లాడే మాటకు ప్రతీకగా చెబుతారు. ఆ మాటలు అదుపులో లేకపోతే కష్టాలపాలు కావలసి ఉంటుంది. కనుక నాలుకను ఎవరికి వారు తమ దగ్గరే తమ వైపునకు తిప్పుకొని అదుపులో ఉంచుకొంటే మేలు అని సూచిస్తుంది గణేశుడి వైపునకు తిరిగి ఉండే వక్త్రతుండం. ‘గుహాగ్రజుడు’ అంటే కుమారస్వామికి అన్న అని అర్థం. ఇలా గణేశ్వరుడికి సంబంధించిన అనేకానేక విషయాలను గణేశ త్యాపిన్యుపనిషత్తు వివరిస్తోంది.

Keywords:
The first worship to Ganapati?,why Do The first worship to Ganpati?,Why is the first worship of Ganpati?


గణపతికి మొదటి పూజలు ఎందుకు?,గణపతికి మొదటి పూజలు ఎందుకు?,గణపతి మొదటి ఆరాధన ఎందుకు? Dharma Sandehalu,Bhakti,Pooja Vidhi,Lord Ganpathi Images

Comments